ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు.. ప్రమాదంలో విజయ్ నామినేషన్

by Kema Shiva Kumar |

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌పై వివాదం చెలరేగుతోంది.

ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు.. ప్రమాదంలో విజయ్ నామినేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు తలపతి విజయ్ (Thalapathy Vijay) ఎన్నికల అఫిడవిట్‌పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన సమర్పించిన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్‌ (Election Commission)కు ఫిర్యాదులు అందడం రాజకీయంగా వేడిని పెంచుతోంది. విజయ్ తన అఫిడవిట్‌లో మొత్తం రూ.625 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. ఇందులో రూ.404 కోట్ల చరాస్తులు, రూ.220 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, విజయ్ తన ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించారని, విదేశీ పెట్టుబడుల వివరాలను దాచారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని పాత పన్ను వివాదాలు (Tax issues), ఇతర పెండింగ్ కేసుల వివరాలు అఫిడవిట్‌లో లేవంటూ ఈసీకి ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే నివేదికల నేపథ్యంలో అఫిడవిట్‌లో ఆ వివరాలను ఎందుకు పొందుపరచలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విజయ్ తన భార్య సంగీత (Sangeetha) నుంచి విడిపోయారనే వార్తలు వస్తున్నాయి. అయితే, అఫిడవిట్‌లో జీవిత భాగస్వామి కాలమ్‌లో ఆమె పేరు పేర్కొన్నప్పటికీ, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉందన్న అంశంపై క్లారిటీ లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ అఫిడవిట్లపై అందిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. ఒకవేళ అఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని తేలితే విజయ్ నామినేషన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే, విజయ్ లీగల్ టీమ్ ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అఫిడవిట్ నిబంధనల ప్రకారమే ఉందని.. రాజకీయ కక్షతోనే ఇవన్నీ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. ఈ వివాదం ఆయన ప్రచారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే మరి.

Next Story