Digital arrest: డిజిటల్ అరెస్ట్ కేసుల్లో 83,668 వాట్సాప్ ఖాతాలు బ్లాక్.. హోం మంత్రిత్వ శాఖ వెల్లడి

by vinod kumar |
Digital arrest: డిజిటల్ అరెస్ట్ కేసుల్లో 83,668 వాట్సాప్ ఖాతాలు బ్లాక్.. హోం మంత్రిత్వ శాఖ వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: డిజిటల్ అరెస్ట్ స్కాముల్లో పాల్గొన్న 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గుర్తించి బ్లాక్ చేసినట్టు హోం మంత్రిత్వ శాఖ బుధవారం రాజ్యసభకు తెలిపింది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఎంపీ తిరుచ్చి శివ (Shiva) అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. సైబర్ నేరగాళ్లు ఈ ఖాతాలను ఉపయోగించి ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీల అధికారులుగా నటిస్తూ మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచడానికి I4C, టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) సహకారంతో కాలర్ ట్యూన్ ప్రచారాన్ని కూడా ప్రారంభించామని తెలిపారు.

ఈ ప్రచారం సైబర్ నేరాల హెల్ప్‌లైన్ నంబర్ 1930, నేషనల్ సైబర్ నేరాల రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) లను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు సైబర్ నేరాలపై 13.36 లక్షలకు పైగా ఫిర్యాదుల అందాయని, వీటి ఆధారంగానే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రూ. 4386 కోట్లకు పైగా నష్టాలను నివారించగలిగామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల (TSPs) సమన్వయంతో, ఇన్‌కమింగ్ అంతర్జాతీయ స్పూఫ్డ్ కాల్‌లను గుర్తించి నిరోధించడానికి ఒక వ్యవస్థను అభివృద్ధి చేసిందని వెల్లడించారు.



Next Story

Most Viewed