- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెయిల్, పెరోల్, ఫర్లో.. ఈ మూడింటి మధ్య తేడాలు తెలుసా ?
హత్యలు, స్కాములు, వివిధ రకాల కేసుల్లో నిందితులుగా జైలుకు వెళ్తుంటారు. కొందరికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, పెరోల్ ఇచ్చిందని, ఫర్లోపై బయటకు వచ్చారని వింటుంటాం.

దిశ, వెబ్‌డెస్క్: హత్యలు, స్కాములు, వివిధ రకాల కేసుల్లో నిందితులుగా జైలుకు వెళ్తుంటారు. కొందరికి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, పెరోల్ ఇచ్చిందని, ఫర్లోపై బయటకు వచ్చారని వింటుంటాం. ఏదైనా వాళ్లు బయటికే వస్తారు కదా ఇన్నిరకాల పేర్లెందుకు అని మీకెప్పుడైనా డౌటొచ్చిందా? వీటి అర్థం ఒకటే అయినా.. సందర్భాలను బట్టి ఆ పదాలను వాడుతారు. చట్టపరంగా వీటిమధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం.
బెయిల్ అంటే..
ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని విచారణ జరుగుతున్న సమయంలో లేదా శిక్ష ఖరారు కాకముందు తాత్కాలికంగా విడుదల చేయడమే బెయిల్. నేరం రుజువు కాకముందు అతడిని నిందితుడిగానే పరిగణిస్తారు. రోజూ లేదా వారానికొకసారి పోలీస్ స్టేషన్ కు హాజరు కావడం, వాయిదాలకు రావడం, దేశం విడిచి వెళ్లకుండా, పూచీకత్తు.. తదితర షరతులపై కోర్టు బెయిల్ ఇస్తుంది. ఈ బెయిల్ లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. రెగ్యులర్ బెయిల్, ముందస్తు బెయిల్ (Anticipatory Bail), తాత్కాలిక బెయిల్ (Interim Bail). డిఫాల్ట్ బెయిల్, మెడికల్ బెయిల్ కూడా ఉన్నాయి.
రెగ్యులర్ బెయిల్ : నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత లేదా జైలులో లేక పోలీస్ కస్టడీలో ఉన్నపుడు కోర్టు ద్వారా షరతులతో విడుదల చేయడం.
ముందస్తు బెయిల్ : ఏదైనా కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్న వ్యక్తి ముందే కోర్టును ఆశ్రయించి అరెస్ట్ నుంచి రక్షణగా తెచ్చుకునేది ముందస్తు బెయిల్.
తాత్కాలిక బెయిల్ : రెగ్యులర్ లేదా, ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణలో ఉన్న సమయంలో కొద్దిరోజులు లేదా కొంతకాలంపాటు ఇచ్చే బెయిల్ ఇది. అంటే ముఖ్యమైన బెయిల్ పై నిర్ణయం వచ్చే వరకూ తాత్కాలిక వెసులుబాటు అనమాట. దీనినే మధ్యంతర బెయిల్ అని కూడా అంటారు.
డిఫాల్ట్ బెయిల్ : పోలీసులు నిర్ణీత గడువులో ఛార్జ్ షీట్ వేయకపోతే నిందితుడికి చట్టపరంగా బెయిల్ హక్కుగా వస్తుంది.
మెడికల్ బెయిల్ : నిందితుడికి తీవ్రమైన అనారోగ్యం ఉన్నపుడు చికిత్స నిమిత్తం టెంపరరీగా ఇచ్చే బెయిల్ ఇది.
పెరోల్ అంటే..
పెరోల్ అనేది కోర్టు లేదా జైలు అధికారులు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి కొన్ని అత్యవసర వ్యక్తిగత కారణాల నేపథ్యంలో తాత్కాలికంగా జైలు బయటకు వెళ్లేందుకు ఇచ్చే అనుమతి. ఇది ఇప్పటికే దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకే వర్తిస్తుంది. సాధారణంగా తల్లి, తండ్రి, భార్య, భర్త లేదా సన్నిహిత బంధువు మరణం, తీవ్రమైన అనారోగ్యం, కుటుంబంలో పెళ్లి వంటి ముఖ్యమైన సందర్భాలు, లేదా ఖైదీ అనారోగ్యంతో ఉండి.. వైద్య చికిత్స అవసరమైనప్పుడు పెరోల్ మంజూరు చేస్తారు. పెరోల్ ఒక హక్కు కాదు. జైలు నిబంధనలు, అధికారుల సంతృప్తి ఆధారంగా ఇచ్చే వెసులుబాటు మాత్రమే. నిర్ణయించిన కాలం పూర్తయ్యాక ఖైదీ తప్పనిసరిగా మళ్లీ జైలుకు తిరిగి రావాల్సి ఉంటుంది. శిక్ష కొనసాగుతూనే ఉంటుంది.
ఫర్లో వీరికి మాత్రమే..
ఫర్లో అనేది కోర్టు శిక్ష విధించిన తరువాత జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి.. మంచి ప్రవర్తన కలిగి, జైలు నిబంధనలు పాటించిన నేపథ్యంలో, మానసిక విశ్రాంతి, కుటుంబ సంబంధాలు కొనసాగించుకునేందుకు కొంతకాలం పాటు జైలు బయట ఉండేందుకు ఇచ్చే అనుమతి. ఇది అత్యవసర పరిస్థితుల కోసం కాదు. సాధారణంగా కొన్నేళ్లు శిక్ష పూర్తయిన తర్వాత అర్హత కలిగిన ఖైదీలకు.. కుటుంబంతో సమయం గడపడం, సమాజంతో సంబంధాలు నిలబెట్టుకోవడం వంటి ఉద్దేశాలతో మంజూరు చేస్తారు. ఫర్లో ఒక హక్కు కాదు. ఇది జైలు పాలసీ, అధికారుల అనుమతి ఆధారంగా ఇచ్చే వెసులుబాటు మాత్రమే. నిర్ణయించిన రోజులు ముగిసిన తర్వాత ఖైదీ తప్పనిసరిగా తిరిగి జైలుకు హాజరుకావాలి అయితే ఫర్లోలో గడిపిన కాలం శిక్ష కాలంలో లెక్కిస్తారు.






