ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ

by Malleboina Mahesh |

విద్యార్థులపై జరుగుతున్న దాడులు, పరీక్షల లీకేజీల వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న నిరసనలకు మరోసారి రాహుల్ గాంధీ (Rahul Gandhi) మద్దతు తెలిపారు. ఈ రోజు(శనివారం) ఉదయం జంతర్ మంతర్ వద్దకు వెళ్లిన ఆయన నిరసనల్లో పాల్గోన్న విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై జరుగుతున్న దాడులు, పరీక్షల లీకేజీల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆందోళనల్లో అనేకమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, వారిపై లాఠీఛార్జ్‌లు చేసి కాళ్లు, తలలు విరగ్గొట్టారని ఆయన మండిపడ్డారు. ఈ దారుణానికి కారణమైన నిర్వాహకులు, అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నందుకుగాను దేశంలోని యువతకు తక్షణమే క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.

విద్యార్థులు కోరుతున్న మూడు డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan)ను వెంటనే క్యాబినెట్ నుంచి 'బర్తరఫ్'చేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలాగే "ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి వేరే శాఖకు మారుస్తారనే ప్రచారం జరుగుతోందని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, ప్రధాన్ అవినీతికి, మన దేశ విద్యార్థుల భవిష్యత్తు నాశనానికి ప్రతీకగా మారారు. ఆయనను మరే శాఖకూ మార్చడానికి వీల్లేదు, నేరుగా పదవి నుంచి తొలగించాల్సిందే" అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

Next Story