- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DGCA: పైలట్ శిక్షణా సంస్థలకు ర్యాంకింగ్ విధానం
పనితీరు ఆధారిత, పారదర్శకత కలిగిన శిక్షణా వ్యవస్థను పెంపొందించడం దీని లక్ష్యం.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో పైలట్ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి నాణ్యత, భద్రతను మెరుగుపరిచేందుకు విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమాన శిక్షణా సంస్థలకు ర్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇటీవలి విమానాల ప్రమాదాలు, ఇతర ఘటనలను పరిగణలోకి తీసుకుని శిక్షణా సంస్థల్లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు డీజీసీఏ వెల్లడించింది. దేశంలో పైలట్ శిక్షణ నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అదే సమయంలో పనితీరు ఆధారిత, పారదర్శకత కలిగిన శిక్షణా వ్యవస్థను పెంపొందించడం దీని లక్ష్యం.
డీజీసీఏ వివరాల ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కొత్తగా ర్యాంకింగ్ సిస్టమ్ అందుబాటులో వస్తుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది అక్టోబర్ 1, ఏప్రిల్ 1న రెండుసార్లు ర్యాంకులను ప్రకటిస్తారు. పైలట్ శిక్షణలో నాణ్యత, భద్రతను పెంచడంలో మరింత నిబద్ధత అవసరమని భావిస్తున్నాం. పనితీరును బట్టి ర్యాంకిన్స్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మానవుల పొరపాటు కారణంగా జరిగే ప్రమాదాలను నివారించవచ్చని డీజీసీఏ అభిప్రాయపడింది.
ఈ ర్యాంకులను ఇవ్వడానికంటే ముందు డీజీసీఏ పలు కీలక అంశాలను పరిగణిస్తుంది. ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థ(ఎఫ్‌టీఓ) మొత్తం స్కోర్ 85 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే ఏ++, 70-85 శాతం ఉంటే ఏ+, 70-50 శాతం ఉంటే ఏ ర్యాంకింగ్, 50 శాతం కంటే తక్కువ ఉంటే బీ ర్యాంకింగ్ ఇవ్వనున్నారు. బీ ర్యాంక్ వచ్చిన సదరు సంస్థకు డీజీసీఏ నోటీసులు ఇస్తుంది. తద్వారా సంస్థలు స్వంగా సమీక్ష చేసుకుని, మెరుగైన పనితీరును కలిగి ఉండాలని ఆదేశాలిస్తుంది. ఎఫ్‌టీఓల పనితీరుపై ఒక అంచనాకు రావడానికి ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ఉపయోగపడనుంది. అంతేకాకుండా భవిష్యత్తులో పైలట్ కావాలనుకునేవారు మెరుగైన ర్యాంకింగ్ ఉన్న సంస్థలను ఎంచుకునేలా కూడా ఇది పనికొస్తుంది.






