Devendra Fadnavis: దేవేంద్ర ఫడ్నవీస్ తొలి కేబినెట్ భేటీ.. తొలి సంతకం దీనిపైనే

by Mahesh Kanagandla |
Devendra Fadnavis: దేవేంద్ర ఫడ్నవీస్ తొలి కేబినెట్ భేటీ.. తొలి సంతకం దీనిపైనే
X

దిశ, నేషనల్ బ్యూరో: అతిరథ మహారథుల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharashtra Chief Minister)గా దేవేంద్ర సరితా గంగాధర్రావ్ ఫడ్నవీస్(Devendra Fadnavis) మూడోసారి ప్రమాణ స్వీకారం(Oath Taking Ceremony) చేశారు. చివరి వరకూ సస్పెన్స్ కొనసాగించిన శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), ఎన్సీపీ నేత అజిత్ పవార్‌(Ajit Pawar)లు డిప్యూటీ సీఎం(Deputy CM)లుగా ప్రమాణం తీసుకున్నారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఈ ముగ్గురితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, ముగ్గురు నాయకులు మహారాష్ట్ర సచివాలయానికి వెళ్లి చత్రపతి శివాజీ మహారాజ్, జిజా బాయి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా ఫూలే పటాలకు పుష్పమాలలతో నివాళులు అర్పించారు. తర్వాత తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోనే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన తొలి సంతకాన్ని రూ. 5 లక్షల సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై పెట్టారు. పూణెకు చెందిన పేషెంట్ చంద్రకాంత్ శంకర్ కుర్హదేవకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్‌మెంట్ కోసం ఈ నిధుల విడుదలకు ఆదేశించారు. ఏక్‌నాథ్ షిండే ఆ తర్వాత కొలాబాలోని బాలాసాహెబ్ ఠాక్రే విగ్రహానికి గజమాల వేసి నివాళి అర్పించారు. బాల్ ఠాక్రే రాజకీయ వారసుడినే తానేనని చెప్పకనే చెప్పారు. ప్రమాణ స్వీకార సమయంలో ఏక్‌నాథ్ షిండే రాజకీయ ప్రసంగం ఇవ్వబోతుండగా గవర్నర్ వెంటనే వారించారు. దీంతో క్షణకాలం ఖంగుతిన్న షిండే తేరుకుని ప్రమాణం చేసి వెనక్కి కదిలారు. సుమారు 40 వేల మంది హాజరైన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, సీఎంలు నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యానాథ్, భజన్‌లాల్ శర్మ, పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ వంటి సెలెబ్రిటీలు, సచిన్ టెండూల్కర్ ఆయన భార్య అంజలి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రోగ్రామ్‌కు అటెండ్ అయ్యారు.

లడ్కీ బహిన్ కొనసాగుతుంది..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి గేమ్ చేంజర్‌గా నిలిచిన మాఝీ లడ్కీ బహిన్ పథకం ఇకపైనా కొనసాగుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ‘ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ నాతో ఉన్నారు. ప్రజలు సుస్థిర ప్రభుత్వం కావాలనుకున్నారు. అందుకే మమ్మల్ని ఎన్నుకున్నారు. మేం కలిసికట్టుగా ఉంటాం. ఇది వరకున్నట్టే కలిసికట్టుగా ముందుకు సాగుతాం. అదే స్పీడు, అదే పట్టుదలతో అభివృద్ధికి పాటుపడతాం. ఇప్పుడు మారింది కేవలం పాత్రలు మాత్రమే. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాల్సి ఉన్నది. 2019-2022మధ్యలో జరిగినట్టుగా రాజకీయ సంకటాలు పునరావృతం అవుతాయని అనుకోవట్లేదు. ఈ నెల 7, 8వ తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ 9వ తేదీన ప్రసంగిస్తారు. దానికి ముందు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకుంటాం... ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగిందని భావించడం లేదు. గతంలో ఇంతకంటే ఎక్కువ రోజుల వ్యవధి పట్టిన సందర్భాలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు చాలా సార్లు సంప్రదింపులు జరుగుతుంటాయి. మేం విజయవంతంగా చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చాం. పోర్ట్‌ఫోలియోలు కూడా దాదాపు ఖరారు కావొచ్చాయి. త్వరలోనే ఆ పని కూడా ముగుస్తుంది.

సీఎంకు నా సంపూర్ణ మద్దతు: షిండే

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ‘చారిత్రాత్మక కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు అభినందనలు. దేశానికి భావజాల దిక్సూచిగా నిలిచే మహారాష్ట్రకు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ముఖ్యమంత్రిగా వ్యవహరించే సువర్ణావకాశం దక్కింది. అందుకే 2.5 ఏళ్లలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోగలిగతాం. మా సుపరిపాలనను మెచ్చి ప్రజలు అపూర్వ విజయాన్ని అందించారు. రెండున్నరేళ్ల క్రితం మా వెంట 40 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజలు 60 మందిని ఇచ్చారు. నన్ను నేను చీఫ్ మినిస్టర్(సీఎం)గా కాకుండా కామన్ మ్యాన్‌గా భావించుకునేవాడిని. ఇప్పుడు డిప్యూటీ సీఎం(డీసీఎం)గా కాకుండా డెడికేటెడ్ కామన్ మ్యాన్‌గా భావిస్తాంను. సీఎంకు నా సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటుంది’ అని ఏక్‌నాథ్ షిండే అన్నారు.

పోర్ట్‌ఫోలియోల పంచాయితీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీటును ముందుగా వదిలిపెట్టుకున్న షిండే.. కొన్ని పోర్ట్‌ఫోలియోల కోసం ప్రమాణ స్వీకారానికి కొన్ని క్షణాల ముందు వరకు పట్టుబట్టారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పోర్ట్‌ఫోలియోలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నదని వివరించారు. హోం, రెవెన్యూ, పట్టణాభివృద్ధి శాఖలపై బీజేపీ పెద్దల నుంచి హామీ కోసం ఆయన చివరి వరకూ ఎదురుచూసినట్టు తెలిసింది. కానీ, డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారానికి అంగీకరించడంలో బీజేపీ నేత గిరీష్ మహాజన్ కీలక పాత్ర పోషించారు. మహాయుతి ప్రభుత్వంలో ఇది వరకే తమ వద్ద ఉన్న ఆర్థిక, వ్యవసాయ, సమన్వయ శాఖలను తిరిగి తమకే ఇవ్వాలని ఎన్సీపీ కోరుతున్నది. మిత్రపక్షాలకే పూర్తి అధికారాన్ని ఇవ్వకుండా అధికార సమతుల్యం పాటించే ఫార్ములాను బీజేపీ ప్రిపేర్ చేసినట్టు ఓ నేత తెలిపారు. ఎన్సీపీకి ఫైనాన్స్ శాఖ ఇస్తే.. సహాయ మంత్రిగా బీజేపీ నేత ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు వివరించారు. కీలక పోర్ట్‌ఫోలియోలు కేటాయిస్తే పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఉపకరిస్తాయని శివసేన, ఎన్సీపీలు భావిస్తున్నట్టు వివరించారు. తొలి విడతలో 15 నుంచి 20 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండొచ్చు. ఆ తర్వాత మిగిలిన పోర్ట్‌ఫోలియోల మంత్రులు ప్రమాణం చేయొచ్చు. ఏకాభిప్రాయానికి రాని కొన్ని పోర్ట్‌ఫోలియోలను ఖాళీగానే ఉంచి సంప్రదింపులు కొనసాగించే అవకాశముంది. అన్ని శాఖలు కేటాయిస్తే తాము కోరుకున్న పోర్ట్‌ఫోలియో దక్కలేదనే అసంతృప్తి ఏర్పడుతుందని, అందుకే ఈ స్ట్రాటజీని అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు మహాయుతి వర్గాలు వివరించాయి. మహారాష్ట్రలో సీఎం సహా 43 మంది మంత్రులకు అవకాశం ఉన్నది. 132 సీట్లు గెలిచిన బీజేపీ 24 బెర్త్‌లు, 57 ఎమ్మెల్యేలున్న శివసేనకు 10.. 41 ఎమ్మెల్యేలున్న అజిత్ పవార్ పార్టీకి తొమ్మిది మినిస్టర్ బెర్త్‌లు ఇచ్చే అవకాశముంది.

నేను సముద్రాన్ని.. ముంచెత్తుతా

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అజిత్ పవార్ మద్దతుతో తెల్లవారుజామునే దేవేంద్ర ఫడ్నవీస్ ఆకస్మిక ప్రమాణ స్వీకారం చేశారు. సంఖ్యా బలం లేక మూడు రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ‘అలలు వెనక్కి తగ్గాయని.. తీరంలో ఇల్లు కట్టుకోకు! నేను సముద్రుడిని తిరిగి కమ్ముకుని వస్తాను’ అంటూ ఫడ్నవీస్ చేసిన కామెంట్స్ హైలైట్. ఈ వ్యాఖ్యలను దేవేంద్ర ఫడ్నవీస్ నిలబెట్టుకున్నారు. బంపర్ మెజార్టీతో మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో తొలిసారి సీఎంగా చేపట్టిన ఫడ్నవీస్ ఐదేళ్లు కొనసాగారు. 2019లోనూ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా సీఎం సీటుపై పేచీతో అప్పటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఝలక్ ఇవ్వడంతో బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది.

Advertisement

Next Story

Most Viewed