- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Exclusive: మీతో కలిసి చాయ్ తాగాలని ఉంది.. మావోయిస్టు పాపారావుతో డిప్యూటీ సీఎం ఫోన్ సంభాషణ
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రస్థానం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రస్థానం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా అటవీ ప్రాంతంలో కీలక నేతగా ఉన్న మావోయిస్ట్ కమాండర్ పాపారావు, తన 21 మంది అనుచరులతో కలిసి ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మతో పాపారావు నేరుగా ఫోన్లో మాట్లాడారు. దట్టమైన అటవీ ప్రాంతం నుండి పాపారావు మరియు అతని బృందాన్ని తీసుకువచ్చేందుకు వెళ్లిన ఒక మధ్యవర్తి ద్వారా విజయ్ శర్మతో ఫోన్లో మాట్లాడించారు.
ఫోన్ ఎత్తగానే "మీరు క్షేమంగా ఉన్నారా?" అని హోం మంత్రి ఆరా తీశారు. దానికి పాపారావు స్పందిస్తూ తామంతా ఆరోగ్యంగానే ఉన్నామని సమాధానమిచ్చారు. పారావుతో పాటు ప్రస్తుతం 21 మంది సభ్యులు ఉన్నారని, వారందరి వద్ద AK-47లు, SLR తుపాకులు వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని వెల్లడైంది. అడవిలో భద్రతా దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నందున, తాము బయటకు రావడానికి భద్రత కల్పించాలని పాపారావు కోరారు. దీనిపై విజయ్ శర్మ స్పందిస్తూ, ఎటువంటి ఇబ్బంది లేకుండా బలగాలను వెనక్కి తగ్గిస్తామని, రేపు ఉదయం ఒక బస్సును ఏర్పాటు చేసి మిమ్మల్ని సురక్షితంగా జగదల్‌పూర్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
చాయ్ తాగుదాం రండి..
ఫోన్ సంభాషణ ముగింపులో ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ సరదాగా స్పందిస్తూ, "పాపారావు గారు, మీతో కలిసి కూర్చుని టీ తాగాలని ఉంది, త్వరగా రండి" అని ఆహ్వానించారు. ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మార్చి 31 నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో, పాపారావు వంటి సీనియర్ నేత లొంగిపోవడం ప్రభుత్వానికి పెద్ద విజయంగా భావిస్తున్నారు. పాపారావు చాలా పాత మరియు కీలకమైన పేరు కావడంతో, ఇతని లొంగుబాటుతో బస్తర్ ప్రాంతంలో మావోయిస్ట్ కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. రేపు ఉదయం వీరంతా అధికారికంగా లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






