Deportation: భద్రతా హామీ లేకుండా డిపోర్ట్.. అమెరికా కీలక నిర్ణయం !

by B.Srinivas |

వలసదారులను ఆరు గంటల ముందస్తు నోటీసుతో స్వదేశానికి గాకుండా వేరే దేశానికి పంపించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

Deportation: భద్రతా హామీ లేకుండా డిపోర్ట్.. అమెరికా కీలక నిర్ణయం !
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా కొత్త డిపోర్టేషన్ ప్లాన్‌ను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. వలసదారులను ఆరు గంటల ముందస్తు నోటీసుతో స్వదేశానికి గాకుండా వేరే దేశానికి పంపించాలని యోచిస్తున్నట్టు సమాచారం. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఈ నిర్ణయం తీసుకున్నట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. వారిని స్వీకరించే దేశాల నుంచి ఎటువంటి భద్రతా హామీలు లేకపోయినా బహిష్కరించాలని భావిస్తున్నట్టు తెలిపాయి. భద్రతా హామీ లేకుండా వలసదారులను పంపే సందర్భంలో సాధారణంగా 24 గంటల ముందు నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్రక్రియను కేవలం ఆరు గంటల్లోనే పూర్తిచేయొచ్చని నివేదిక పేర్కొంది.

అమెరికా తీసుకున్న ఈ కొత్త విధానం గత పాలసీలకు పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే గతంలో వలసదారులను మూడో దేశాలకు పంపడం చాలా అరుదుగా జరుగుతూ ఉండేది. తాజా నిర్ణయంతో వేలాది మంది వలసదారులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వదేశంలో ప్రమాదాలను ఎదుర్కొనే వారు, లేదా అమెరికాతో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న చైనా, క్యూబా వంటి దేశాల నుంచి వచ్చిన వలసదారులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అయితే ఈ విధానం వల్ల వేలాది మంది వలసదారులకు ప్రమాదం తలెత్తొచ్చని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో భద్రతా హామీ లేకపోయినా, వలసదారులను ఇతర దేశాలకు తక్షణం పంపించే మార్గం సుగమం అయిందని ఐసీఈ చీఫ్ టాడ్ లియాన్స్ వెల్లడించారు.

Next Story