- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. తొమ్మిది దాటినా కనిపించని సూరీడు!
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయింది.

దిశ, డైనమిక్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయింది. దీంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో గాలిలో కాలుష్యం మరింత పెరగడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ‘వెరీ పూర్’ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో GRAP-III కింద ఆంక్షలను మళ్లీ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిర్మాణ కార్యకలాపాలపై పరిమితులు విధించడంతో పాటు, డీజిల్ వాహనాల వినియోగాన్ని నియంత్రిస్తున్నారు. AIIMS పరిసర ప్రాంతాల్లో డ్రోన్ విజువల్స్‌లో పొగమంచు తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోనూ నెలకొంది. నోయిడా సెక్టర్-115 ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జనవరి 21 వరకు మంచు కురిసే అవకాశం
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 16 నుంచి ఉత్తర భారతదేశంలో చలిగాలులు, దట్టమైన పొగమంచు కొనసాగనున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో విజిబిలిటీ మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావం రోజువారీ జీవితం, రహదారి రవాణా, రైలు, విమానయాన కార్యకలాపాలపై పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అలాగే, ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో జనవరి 21 వరకు మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అత్యవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






