ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.. సీఈసీకి మమతా బెనర్జీ లేఖ

by Kema Shiva Kumar |

పశ్చిమ బెంగాల్ అధికారుల బదిలీలు, నియామకాలపై భారత ఎన్నికల సంఘం (ECI) నిర్ణయాలను తప్పుబడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటైన లేఖ రాశారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.. సీఈసీకి మమతా బెనర్జీ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఎన్నికల వేళ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో భారత ఎన్నికల సంఘం (ECI) వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఆమె కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఘాటైన లేఖ రాశారు. ఈ నిర్ణయాలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు.

అధికారుల బదిలీలపై అభ్యంతరం

రాష్ట్రంలో డీఈఓల (DEO) బదిలీలు సదుద్దేశంతో జరిగినవి కావని మమతా బెనర్జీ లేఖలో పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి, అప్పీల్ చేసుకునేందుకు సమయం లేకుండా ఈ మార్పులు చేయడం ‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’ అని ఆమె విమర్శించారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండానే 15 మంది సీనియర్ పోలీసు అధికారులను ఇతర రాష్ట్రాలకు పరిశీలకులుగా పంపడాన్ని ఆమె తప్పుబట్టారు. శిక్షణ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడం అధికార దుర్వినియోగం అని మమతా మండిపడ్డారు.

బయటి ప్రాంతాల నుంచి అధికారులను తీసుకురావడం వల్ల వారికి స్థానిక భౌగోళిక పరిస్థితులు, భాష, సంస్కృతిపై అవగాహన ఉండదని, దీంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ విఫలమైతే దానికి పూర్తి బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో బెంగాల్‌లో ‘కల్ బైశాఖి’ తుపాన్లు వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి కీలక సమయంలో అనుభవజ్ఞులైన అధికారులను తొలగించడం వల్ల అత్యవసర సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.

ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం..

రాష్ట్రంలోని ఆర్టికల్ 324 ముసుగులో రాష్ట్ర పరిపాలనను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె ఆరోపించారు. ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఎన్నికైన ప్రభుత్వం ఉనికిని చాటుకోవాలని, కేంద్ర పాలన తరహా వాతావరణాన్ని సృష్టించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఏకపక్ష, పక్షపాత నిర్ణయాలను మానుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

Next Story