Delhi elections: ఢిల్లీ ఎన్నికల బరిలో అత్యంత ధనవంతులు ఎవరంటే?

by Shamantha N |

ఢిల్లీ ఎన్నికల వేళ బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది.

Delhi elections: ఢిల్లీ ఎన్నికల బరిలో అత్యంత ధనవంతులు ఎవరంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎన్నికల వేళ బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది. మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా బీజేపీకి చెందిన కర్నైల్ సింగ్ నిలిచారని తెలిపింది. రూ. 259.67 కోట్ల విలువైన ఆస్తులతో కర్నైల్ సింగ్ షకుర్ బస్తీ నుండి పోటీ చేస్తున్నట్లు పేర్కొంది. రెండో స్థానంలో రాజౌరి గార్డెన్ నుండి పోటీ చేస్తున్న బీజేపీకి చెందిన మంజీందర్ సింగ్ సిర్సా ఉన్నారు. రూ. 248.85 కోట్ల విలువైన ఆస్తులతో రెండో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా నిలిచారు. కృష్ణ నగర్ నుండి కాంగ్రెస్‌కు చెందిన గురుచరణ్ సింగ్ రూ. 130.90 కోట్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ రూ. 115.63 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో రాజౌరి గార్డెన్ నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఎ. ధన్వతి చందేలా రూ. 100.90 కోట్ల ఆస్తులతో ఐదో స్థానంలో నిలిచారు.

బీజేపీ అభ్యర్థుల సగటు సంపదే అత్యధికం

అయితే, ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో నిలిచిన బీజేపీ అభ్యర్థుల సగటు సంపద అత్యధికంగా రూ. 22.90 కోట్లుగా ఉందని, కాంగ్రెస్ అభ్యర్థులు రూ. 14.41 కోట్లు, ఆప్ అభ్యర్థులు రూ. 11.70 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మరోవైపు, రాష్ట్రీయ రిపబ్లికన్ పార్టీకి చెందిన అభ్యర్థులు షబానా (సీలంపూర్), మోహిందర్ సింగ్ (మటియాలా), స్వతంత్ర అభ్యర్థి యోగేష్ కుమార్ (మటియాలా) తమ ఆస్తులను ప్రకటించలేదు. సున్నా ఆస్తులు ఉన్న అభ్యర్థులను మినహాయించి అంబేద్కర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ రూ. 6,586 ఆస్తులతో ఎన్నికల్లో ఉన్నారు. మరో స్వతంత్ర అభ్యర్థి అనిత రూ. 9,500 ఆస్తులతో, బహుజన్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమతా పార్టీకి చెందిన ఖిల్ఖిలాకర్ రూ. 10,000 ఆస్తులతో ఉన్నారు. కాగా.. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి.

Next Story