కొడుకుతో మొదలై 72 వేల మంది.. పిల్లల కోసం కెరీర్‌ను వదిలేసిన మహిళ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-10 10:37:03  IST  )

మంచి జీతం, ఎదుగుదల ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి టీచింగ్ వృత్తిని ఎంచుకుందో మాతృమూర్తి. అందుకు కారణం తన కొడుకులో చూడాలనుకున్న మార్పే.. మిగతా పిల్లల్లోనూ రావాలనుకోవడం.

కొడుకుతో మొదలై 72 వేల మంది.. పిల్లల కోసం కెరీర్‌ను వదిలేసిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్ ను తలపిస్తోన్న ఈ రోజుల్లో.. దేశ రాజధానిలోని ఓ ప్రాంతంలో ఒక మహిళ పిల్లలకు వ్యవసాయం నేర్పుతూ.. ప్రకృతితో మనిషి జీవితం ఎలా ముడిపడి ఉందో చెప్తున్నారు. ఆమె సారథ్యంలో పిల్లలంతా ప్రకృతితో మమేకమవుతున్నారు. ఆమెనే ప్రగతి చస్వాల్. పదేళ్లపాటు అడ్వర్టైజింగ్ విభాగంలో పనిచేస్తున్న సమయంలో కార్పొరేట్ జీవితాన్ని వదిలేసి.. చేసే పనికి ఒక అర్థం ఉండాలనుకుంది. లింటాస్, మెక్‌కాన్ వంటి పెద్ద ఏజెన్సీల్లో క్యాంపెయిన్స్ రన్ చేశారు. ఆమె చివరిగా UCP డైరెక్ట్ అనే స్టార్టప్‌లో పనిచేసింది. కెరీర్‌లో ఆమె బాగా రాణించినా ఏదో వెలితి ఉండేది. అందుకే 2013 సంవత్సరంలో కొంత బ్రేక్ తీసుకోవాలనుకుని ఆ ఉద్యోగానికి స్వస్తి పలికిన ఆమె.. పిల్లలకు ఆకలి, ఆహారం, ప్రకృతి గురించి చెప్పడం మొదలుపెట్టారు. Sow Good ఫౌండేషన్ ను స్థాపించి.. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుతోన్న 72 వేల మంది విద్యార్థులకు ఆమె వ్యవసాయం నేర్పిస్తున్నారు.

ఈ ఆలోచన తన జీవన శైలి, తన కొడుకు జీవన శైలిని చూసినప్పుడు వచ్చిందంటారు ప్రగతి చస్వాల్. తన కొడుకు నీల్ ఆహారంలోని కూరగాయలను తీసి పక్కన పెట్టడం, వాటిని ఎందుకు తినాలి? అవి ఎక్కడ నుంచి వచ్చాయో ఆలోచించకపోవడం ఆమె గమనించారు. ఆహారం వృథా అవుతున్నా నీల్ పట్టించుకోకపోవడంతో ఒక తల్లిగా ఆమెనెంతో బాధపెట్టింది. నగరంలోని ఇతర పిల్లల్లో కూడా ఇదే డిస్‌కనెక్ట్ ఆమె చూశారు. ఆహారం ఎలా పండుతుంది, ఏ ఋతువులో ఏ పంట వస్తుంది, నేల, నీరు, సూర్యకాంతి ఎలా కలిసి పనిచేస్తాయో వాళ్లకు తెలియదు. ఈ గ్యాప్‌ను తగ్గించాలని ఆమె నిశ్చయించుకున్నారు. అప్పుడే తన టెర్రస్ పై చిన్న గార్డెన్ ను ప్రారంభించి.. నీల్ కు కూరగాయల్ని ఎందుకు తినాలో, అవి ఎలా పండుతాయో అర్థమయ్యేలా చెప్పారు. అలా 35 రకాల ఫ్రూట్స్, కూరగాయలు, మూలికను పెంచారు. ఆ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, పర్మాకల్చర్, సస్టైనబుల్ పద్ధతుల గురించి నేర్చుకున్నారు. 2015లో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. అలా కొడుకు జీవితంలో మార్పు తీసుకురావాలన్న ప్రగతి ఆలోచన నేడు 72 వేల మంది విద్యార్థులకు చేరింది. పిల్లలు తాము తినే ఆహారం ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకోవడం, వస్తువులను రీ సైకిల్ చేయడం ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడం అవసరమని చెప్తారు ప్రగతి. ఫలితంగా వారు ఆహారాన్ని వృథా చేయరని, ఈ మార్పును తాను గమనించానని చెప్తుంటారు. అలా 2017లో సౌ గుడ్ ఫౌండేషన్ (Sow Good Foundation) పుట్టింది. మొదటి ఫార్మ్ ఢిల్లీలోని BRF అనే చోట స్థాపించారు. అక్కడ నీల్ చదివే మీరాంబికా స్కూల్ నుంచి 8-10 మంది పిల్లలు, తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

సౌ గుడ్ ఫౌండేషన్ కు మూడు సూత్రాలు ఉంటాయి. ఆలోచన, ప్రవర్తన, పంచుకోవడం. ఈ మూడు సూత్రాల ద్వారా పిల్లలకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. ప్రైవేట్ స్కూళ్లు ఈ ప్రోగ్రామ్‌కు ఫీజు చెల్లిస్తాయి, కానీ ప్రభుత్వ స్కూళ్లకు CSR ఫండింగ్ ద్వారా ఉచితంగా అందిస్తారు. సౌ గుడ్ కేవలం ఒక ప్రోగ్రామ్ కాదు, ఒక ఉద్యమం. ఇది పిల్లల్లో జ్ఞానం, ఆసక్తి, బాధ్యత, శ్రద్ధ అనే విత్తనాలను నాటుతుంది. పిల్లలు భూమి విలువను అర్థం చేసుకునే ఆలోచనాపరులుగా ఎదగడానికి సహాయపడుతోంది.

Next Story