- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ ‘రెహమాన్ డెకాయిట్’ కేజ్రీవాలే : ‘షీష్ మహల్ 2’ చిత్రాలను విడుదల చేసిన బీజేపీ, కొట్టిపారేసిన ఆప్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు పర్వేశ్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు పర్వేశ్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్‌ను ఢిల్లీ ‘రెహమాన్ డెకాయిట్’గా అభివర్ణించిన ఆయన, ‘షీష్ మహల్ 2’ పేరుతో కేజ్రీవాల్ కొత్త నివాసానికి సంబంధించినవని చెబుతున్న కొన్ని దృశ్యాలను ఇవాళ (శనివారం) మీడియాకు విడుదల చేశారు. సామాన్యుడిలా ఉంటానని చెప్పిన కేజ్రీవాల్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని పర్వేశ్ వర్మ విమర్శించారు. కేజ్రీవాల్ ఇటీవలే 95 లోధి ఎస్టేట్‌లోని ప్రభుత్వ బంగ్లాకు మారారని, దానిని ‘షీష్ మహల్’లా మార్చేశారని ఆరోపించారు. ఢిల్లీ ఓటర్లు తిరస్కరించడంతో కేజ్రీవాల్ పంజాబ్ వైపు దృష్టి సారించారని, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసం చుట్టూ ఉన్న పలు ప్రభుత్వ బంగ్లాలను కేజ్రీవాల్ సహా సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా వంటి ఆప్ నేతలు ఆక్రమించారని వర్మ ఆరోపించారు.
పూర్తిగా నకిలీ.. ఆప్ కౌంటర్
బీజేపీ విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు పూర్తిగా నకిలీవని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఖండించారు. వీటిని ప్రసారం చేసే టీవీ ఛానెళ్లు, పర్వేశ్ వర్మ పరువునష్టం దావాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎక్స్ (X) వేదికగా హెచ్చరించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఎల్జీ వీకే సక్సేనా, పర్వేశ్ వర్మ తమ ఇళ్లను ప్రజల సందర్శనకు అనుమతించాలని, కేజ్రీవాల్ కూడా అదే చేస్తారని, అప్పుడు ఎవరి ఇల్లు విలాసవంతంగా ఉందో ప్రజలే తేలుస్తారని ఆయన సవాల్ విసిరారు.
బీజేపీలో చేరిన 7 రాజ్యసభ ఎంపీలు
రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు (రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, స్వాతి మలీవాల్, విక్రమ్ సాహ్నీ, రాజేంద్ర గుప్తా) పార్టీని వీడి బీజేపీలో చేరడం ఆప్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. పార్టీ తన మూల సిద్ధాంతాల నుంచి దారి తప్పడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాఘవ్ చద్దా వెల్లడించారు. వీరిని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీలోకి స్వాగతించారు.
సోషల్ మీడియాలో బీజేపీ వ్యంగ్యాస్త్రాలు..
రాజకీయ పరిణామాల మధ్య ఢిల్లీ బీజేపీ.. కేజ్రీవాల్‌ను నియంతలా చూపుతూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘A Film By – AAP-da’, ‘Directed by Arvind Kejriwal’ అంటూ కార్యకర్తలు పార్టీ టోపీలు, చీపుర్లను వదిలేసి వెళ్లిపోతున్నట్లుగా అందులో వ్యంగ్యంగా చిత్రీకరించి ఆప్ అంతర్గత సంక్షోభాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేసింది.






