అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ

by Kema Shiva Kumar |

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఊహిచని షాకిచ్చింది.

అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) మరోసారి చిక్కుల్లో పడ్డారు. కోర్టు విచారణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. జస్టిస్ ఎస్‌కే శర్మ (SK Sharma) నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఓ న్యాయవాది వాదనలు వినిపిస్తున్న వీడియోను కేజ్రీవాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. సాధారణంగా న్యాయస్థానంలో విచారణల వీడియోలను అనుమతి లేకుండా బహిరంగంగా పంచుకోవడం కోర్టు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, కేజ్రీవాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పద వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తక్షణమే తొలగించాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కోర్టు గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించినందుకు గాను, కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో స్పష్టం చేస్తూ నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొంది.

రాజకీయ వర్గాల్లో చర్చ..

కేజ్రీవాల్ ఇప్పటికే పలు కేసుల్లో ఇప్పటికే న్యాయపోరాటం చేస్తుండగా, ఇప్పుడు నేరుగా హైకోర్టు నుంచే ధిక్కరణ నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కోర్టు నిబంధనల పట్ల అవగాహన ఉన్న ఓ మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి పోస్ట్ చేయడంపై న్యాయ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Next Story