- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi: కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రులకు ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అన్ని కొవిడ్ పాజిటివ్ నమూనాలను లోక్ నాయక్ ఆసుపత్రికి పంపాలని సూచించింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా మరోసారి కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అన్ని ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఆసుపత్రులు పడంకలు, ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచుకోవాలని కొవిడ్-19 అడ్వైజరీ జారీ చేసింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అన్ని కొవిడ్ పాజిటివ్ నమూనాలను లోక్ నాయక్ ఆసుపత్రికి పంపాలని సూచించింది. అన్ని ఆసుపత్రుల వర్గాలు తమ వద్ద ఉన్న వెంటిలేటర్లు, బై-పాస్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పీఎస్ఏ వంటి అన్ని పరికరాలు పని చేస్తున్నాయా లేదా పరిశీలించాలని, అనుక్షణం పని చేసే స్థితిలో ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని ప్రమాణాలకు సంబంధించి రోజువారీగా రిపోర్టును కూడా నిర్వహించాలని, దాని గురించి ఢిల్లీ స్టేట్ హెల్త్ డేటా మేనేజ్‌మెంట్ పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొంది. ఈ విషయం గురించి జాతీయ మీడియాతో మాట్లాడిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్.. ఢిల్లీలో ఇప్పటివరకు 23 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కొవిడ్ బారిన పడినవారు ఢిల్లీకి చెందినవారా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారా అనేది ధృవీకరించాల్సి ఉంది. దానికంటే ముందు ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధమవ్వాలని నిర్ణయించాం. ఇప్పటికే అందరు వైద్య సూపరింటెండెంట్లు, వైద్యులు, ఇతర ఆరోగ్య విభాగంలోని వారితో సమన్వయం చేసుకున్నాం. ప్రజలు భయపడాల్సిన అవసరంలేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఢిల్లీ ప్రభుత్వం ఎదుర్కొనే స్థాయిలోనే ఉందని ఆయన వెల్లడించారు. కాగా, హాంకాంగ్, సింగపూర్ సహా ఆసియాలోని కొన్ని చోట్ల కొవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వీటితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులను ఆరోగ్య రంగం అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.






