Delhi elections: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చిన అంశాలివే!

by B.Srinivas |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో అధికారాన్ని సొంతం చేసుకుంది.

Delhi elections: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చిన అంశాలివే!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో అధికారాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగి సక్సెస్ అయింది. ఆప్‌కు ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా అన్ని విషయాలనై బహిర్గతపర్చి ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయానికి దోహదపడిన అంశాలను తెలుసుకుందాం.

ఆప్‌పై వ్యతిరేకత

గత మూడు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో ఉన్న ఆప్‌పై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. అయితే ఈ అవకాశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. ఆప్ అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆప్ అగ్రనేత విమర్శలను తిప్పికొట్టింది. ఢిల్లీలో నెలకొన్న సమస్యలను ఎత్తి చూపుతూ ఓటర్లను ఆకర్షించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉపయోగాలు కూడా ప్రస్తావించారు. దీంతో మెజారిటీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మధ్య తరగతి ప్రజలపైనే ఫోకస్

ఢిల్లీలో మెజారిటీ ఓటర్లు మధ్యతరగతి ప్రజలే. అందుకే ఈ ఓటర్లపై పట్టు సాధించగలిగితే విజయం ఖాయమని భావించిన బీజేపీ ఆ దిశగా అడుగులు వేసింది. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో వారిని టార్గెట్ చేసింది. అందుకే 12లక్షల వరకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో మధ్యతరగతి వర్గాల్లో బీజేపీపై సానుకూలత ఏర్పడింది. అంతేగాక గిగ్ వర్కర్లకు సంబంధించిన ప్రస్తావన కూడా బడ్జెట్ తో ఉండడం కూడా బీజేపీకి కలిసొచ్చిందని చెబుతున్నారు.

ఢిల్లీలోని ప్రధాన సమస్యలపై హామీలు

ఈ ఎన్నికల్లో బీజేపీ పక్కా లోక్ స్కెచ్ తో బరిలోకి దిగింది. ఢిల్లీలో నెలకొన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీనికి తగినట్టుగానే మేనిఫెస్టోలో వాగ్ధానాలు చేసింది. ఢిల్లీలో ప్రధాన సమస్యలైన వాయు కాలుష్యం, యమునా నదిని శుభ్రం చేయడం వంటి హామీలు ఇచ్చింది. దీంతో ఈ సమస్యలను పరిష్కరించడంతో ఆప్ విఫలమైందన్న భావనతో ఉన్న ప్రజలు బీజేపీకి జై కొట్టారని తెలుస్తోంది.

మోడీ వేవ్

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ అని నిరూపించుకున్నారు. ఢిల్లీలో సీఎం అభ్యర్థి లేకపోయినా విజయం సాధించిదంటే అది మోడీకి ఉన్న ప్రజాదరణేనని పలువురు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మోడీ స్వయంగా అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకునే బాధ్యతను తీసుకున్నారు. తన శైలికి అనుగుణంగా కేజ్రీవాల్ పార్టీని ఢిల్లీకి ఆప్డా (విపత్తు) అని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ నకిలీ, అవినీతిపరుడని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు లోక్‌సభ ప్రసంగంలోనూ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో మోడీ వేవ్ సైతం ఎన్నికల్లో పని చేసింది.

కాంగ్రెస్ వర్సెస్ ఆప్

ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ పార్టీలు వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేయడం బీజేపీకి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ప్రచారం సందర్భంగా ఆప్, కాంగ్రెస్ రెండూ ఒకరినొకరు బీజేపీకి టీమ్ అని ఆరోపించారు. రాహుల్, ప్రియాంక గాంధీలు కేజ్రీవాల్ పై వ్యక్తిగత దాడిని ప్రారంభించారు. కేజ్రీవాల్ సైతం కాంగ్రెస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి విమర్శలు గుప్పించారు. దీంతో ఈ రెండు పార్టీలపై ఉన్న వ్యతిరేక ఓటర్లంతా బీజుపీ వైపు నిలిచారు.

ప్రజలను ఆకట్టుకున్న మేనిఫెస్టో

ఉచితాలను తాము దూరమని పలు మార్లు బీజేపీ అగ్రనేతలు వ్యాఖ్యానించారు. ఉచితాలు అందించడం వల్ల ప్రభుత్వం దగ్గర బడ్జెట్ సరిపోదని వెల్లడించారు. అయితే ప్రస్తుత ఢిల్లీ మేనిఫెస్టోలో మాత్రం ఉచిత హామీలు ప్రకటించింది. మూడు విడల్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మాత్రం ఉచిత హామీలు ఇచ్చింది. రూ. 500కే గ్యాస్ సిలిండర్, గర్భిణులకు రూ.21000 ఆర్థిక సాయం, అటల్ క్యాంటీన్లు, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలు ఇచ్చింది. దీంతో ఈ అంశాలు బీజేపీకి కలిసొచ్చాయి.

Next Story