- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో కలకలం.. నకిలీ ఎంబసీ నంబర్ ప్లేట్‌తో మహిళ అరెస్ట్
రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో కలకలం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల మధ్య దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసిన తరుణంలో, విదేశీ రాయబార కార్యాలయం నంబర్ ప్లేట్లను వాడుతున్న ఒక 45 ఏళ్ల మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో కలకలం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల మధ్య దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసిన తరుణంలో, విదేశీ రాయబార కార్యాలయం నంబర్ ప్లేట్లను వాడుతున్న ఒక 45 ఏళ్ల మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు వసంత్ విహార్ ప్రాంతంలో తన ఇన్నోవా కారుకు నకిలీ దౌత్యపరమైన (Diplomatic) నంబర్ ప్లేట్‌ను తగిలించి తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు.
అనుమానాస్పదంగా కారు
క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన 'యాంటీ ఎక్స్‌టార్షన్ అండ్ కిడ్నాపింగ్ సెల్' (AEKC) అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు జనవరి 15 నుంచి వసంత్ విహార్ పరిసరాల్లో నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పదంగా కనిపించిన ఇన్నోవా కారును అడ్డుకుని తనిఖీ చేయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కారుకు ఉన్న నంబర్ ప్లేట్ ఫోర్జరీ చేసినట్లు గుర్తించడమే కాకుండా, కారు లోపల మరో విదేశీ ఎంబసీకి చెందిన నకిలీ ప్లేట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితురాలు విస్తుపోయే విషయాలు వెల్లడించింది. ఢిల్లీలోని దౌత్య కార్యాలయాలు ఉండే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లోకి (High-Security Zones) యథేచ్ఛగా వెళ్లడానికి, పోలీసుల సాధారణ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఆమె ఈ నకిలీ ప్లేట్లను తయారు చేయించినట్లు అంగీకరించింది. తొలుత ఆ వాహనం ఒక దౌత్య మిషన్‌కు చెందినదని బుకాయించినప్పటికీ, సరైన పత్రాలు చూపించక పోవడంలో ఆమె విఫలమైంది.
ఆమెకు ఎవరైనా సహకరించారా?
ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెకు ఎవరైనా సహకరించారా? లేదా ఈ వాహనాన్ని ఉపయోగించి ఏవైనా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, గత కొద్ది రోజులుగా ఆమె ఎవరెవరిని కలిసింది అనే వివరాలను సేకరిస్తున్నారు. కొద్ది వారాల క్రితమే ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల ఒక i20 కారులో పేలుడు సంభవించిన నేపథ్యంలో, ఢిల్లీ పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. జనవరి 26 (రిపబ్లిక్ డే) వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచిన తరుణంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.






