Delhi Polls: ఢిల్లీ ఎన్నికలు.. మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

by Shamantha N |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) సందర్భంగా బీజేపీ మరో మేనిఫెస్టో(Delhi election BJP manifesto)ను విడుదల చేసింది.

Delhi Polls: ఢిల్లీ ఎన్నికలు.. మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) సందర్భంగా బీజేపీ మరో మేనిఫెస్టో(Delhi election BJP manifesto)ను విడుదల చేసింది. ‘సంకల్ప పత్రా’ పేరుతో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మేనిఫెస్టోని ప్రకటించారు. కాగా.. రెండో మేనిఫెస్టోలో విద్యార్థులే లక్ష్యంగా హామీలు ఇచ్చారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన వెంటనే పోటీ పరీక్షల అభ్యర్థులకు రూ. 15,000 సహాయం అందిస్తామని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. పేదవిద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఆటో-టాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, రూ. 10 లక్షల జీవిత బీమా, రూ. 5 ప్రమాద బీమా, వాహన బీమా ప్రకటించారు. వారి పిల్లలకు స్కాలర్‌షిప్‌తో పాటు షెడ్యూల్డ్ కుల వర్గానికి చెందిన విద్యార్థులకు నెలవారీ రూ. 1,000 స్టైఫండ్‌ను కూడా ఇస్తామన్నారు. అంతేకాకుండా, గృహ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, వారికి రూ. 10 లక్షల జీవిత బీమా, రూ. 5 లక్షల ప్రమాద బీమా ఇస్తామన్నారు. వారి పిల్లల కోసం స్కాలర్‌షిప్‌లు.. ఆరు నెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అందిస్తామన్నారు. మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. “మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆరోగ్యం, ట్రాఫిక్, విద్యుత్, నీరు, రవాణా సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఢిల్లీ ప్రజలకు మెరుగైన భవిష్యత్ ని అందించేందుకు ప్రయత్నిస్తాం” అని అన్నారు.

బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు

బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసిన వెంటనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. కాషాయపార్టీ మ్యానిఫెస్టోను "ప్రమాదకరమైనది" అని అన్నారు. “మొహల్లా క్లినిక్‌లను మూసివేస్తామని వారు తమ మ్యానిఫెస్టోలో స్పష్టంగా రాశారు. ఢిల్లీ ప్రజలకు ఉచిత చికిత్స లభించడం వారికి ఇష్టం లేదు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ ఉచిత విద్యను నిలిపివేస్తుంది” అని అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో అన్నారు. ఢిల్లీ ప్రజలకు అందిస్తున్న అన్ని పథకాలను ఆపడానికి మాత్రమే బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో పోరాడుతుందని ఆరోపించారు. ఉచిత విద్య, ఉచిత చికిత్స నిలిపివేస్తామని ఇప్పుడు అంగీకరించారని అన్నారు. ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఇతర పథకాలను కూడా నిలిపివేసేలా చూస్తున్నారు. ఇకపోతే, 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Next Story