కేజ్రివాల్ 15 గ్యారెంటీలు.. ఆప్ మేనిఫెస్టో ఆవిష్కరణ

by Ajay Maddhiboyina |

ఢిల్లీలో మరోసారి అధికారంలోకి వస్తే తాము ఉద్యోగ కల్పనకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ఏ ఒక్క పౌరుడు కూడా నిరుద్యోగిగా ఉండడని కేజ్రివాల్ హామీ ఇచ్చారు.

కేజ్రివాల్ 15 గ్యారెంటీలు.. ఆప్ మేనిఫెస్టో ఆవిష్కరణ
X

- రాబోయే 5 ఏళ్లలో కచ్చితంగా అమలు

- గతంలో ఇచ్చిన వాటిలో రెండు హామీలు నెరవేర్చలేకపోయాం

- అందుకు ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు

- ఈ గ్యారెంటీలు తప్పక అమలు చేస్తాం

- బీజేపీ ఓటేస్తే ఉన్న పథకాలు తీసేస్తారు

- ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్

దిశ, నేషనల్ బ్యూరో:

దేశంలో అత్యంత ఆసక్తికలిగిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఆప్ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ సోమవారం ఆవిష్కరించారు. ఆప్ అధికారంలోకి వస్తే తప్పకుండా 15 గ్యారెంటీలను రాబోయే ఐదేళ్లలో అమలు చేస్తామని కేజ్రివాల్ ప్రజలకు మాటిచ్చారు. ఇవ్వాళ మేము కేజ్రివాల్ గ్యారెంటీలు అని చెబుతున్నామంటే అవి తప్పకుండా అమలు చేస్తామని మాటిచ్చినట్లే అన్నారు. బీజేపీ నాయకులు మేనిఫెస్టోలు, సంకల్ప పాత్రలు అంటూ ఎన్నో పేర్లతో హామీలు ఇస్తుంటారు. కానీ అవి అమలు చేసే ప్రసక్తే ఉండదు. వారి కోసం ఇవన్నీ ఎన్నికల మోసాలు మాత్రమే. బీజేపీ రూ.15 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రజలకు ఇప్పటి వరకు ఆ డబ్బులు వేయలేదని కేజ్రివాల్ విమర్శించారు. అమిత్ షాను ఈ విషయం అడిగితే.. ఈ హామీలన్నీ ఎన్నికల కోసం చేసిన మోసం అని చెప్పినట్లు కేజ్రివాల్ గుర్తు చేశారు.

ఢిల్లీలో మరోసారి అధికారంలోకి వస్తే తాము ఉద్యోగ కల్పనకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ఏ ఒక్క పౌరుడు కూడా నిరుద్యోగిగా ఉండడని కేజ్రివాల్ హామీ ఇచ్చారు. గత వారం తాను అనేక ప్రాంతాల్లో ఎంతో మంది ప్రజలను కలిశాను. డిగ్రీలు ఉండి, చదువు పూర్తి చేసుకొని నిరుద్యోగ సమస్యతో అనేక మంది బాధపడుతున్నట్లు తన దృష్టికి తీసుకొని వచ్చారు. మా దగ్గర మనీష్ సిసోడియా, ఆతిషి వంటి చదువుకున్న నాయకులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు ఎలా ఇవ్వలో తెలుసు. బీజేపీలో చదువుకున్న వ్యక్తులు ఎవరున్నారు? వారికి నిరుద్యోగ సమస్య ఎందుకు అర్థమవుతుందని కేజ్రివాల్ ఆరోపించారు.

మహిళలకు ప్రతీ నెల రూ.2,100 మహిళా సమ్మాన్ యోజన ద్వారా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అందిస్తామని కేజ్రివాల్ పేర్కొన్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి సంజీవనీ యోజన ద్వారా ఉచిత ఆరోగ్య భీమా అందిస్తామని చెప్పారు. అలాగే నీటి బిల్లులు తగ్గిస్తామని, దళిత విద్యార్థుల ఉన్నత విద్యకు అంబేద్కర్ పేరుతో స్కాలర్‌షిప్స్ అందిస్తామని, విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, అలాగే మెట్రోలో 50 శాతం రాయితీ కల్పిస్తామని అర్వింద్ కేజ్రివాల్ హామీ ఇచ్చారు.

ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు..

2020 ఎన్నికల్లో ఇచ్చిన రెండు హామీలను నెరవేర్చలేకపోయామని, అందుకు ఢిల్లీ ప్రజలు తమను క్షమించాలని కోరారు. యమునా నది ప్రక్షాళన, ఢిల్లీ రోడ్లను యూరోప్ రోడ్ల స్థాయికి తీసుకొస్తామని చెప్పిన హామీలు నెరవేర్చనందుకు ఢిల్లీ ప్రజలను క్షమాపణలు కోరారు. అయితే అందుకు గల కారణాలను కూడా అర్వింద్ కేజ్రివాల్ వివరించారు. 2020లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కోవిడ్ కారణంగా మా ప్రణాళికలు అమలు చేయలేకపోయాము. అలాగే మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్, సంజయ్‌తో పాటు తనను కూడా తప్పుడు కేసుల్లో జైలుకు పంపారు. దీంతో గత ఐదేళ్లలో ఆ హామీలను నెరవేర్చలేకపోయామన్నారు. కానీ ఈ సారి గెలిపిస్తే తప్పకుండా ఆ రెండు హామీలు కూడా నెరవేరుస్తాము. మన ఖజానాలో డబ్బు ఉంది. అలాగే ఈ పథకాల అమలుకు కచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయని కేజ్రివాల్ చెప్పారు. అంతే కాకుండా ఈ హామీలు నెరవేరుస్తానంటూ కేజ్రివాల్ ప్రతిజ్ఞ చేసి, సంతకాలు చేశారు.

ఇవే 15 గ్యారెంటీలు

1. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం

2. మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు ప్రతీ నెల రూ.2,100 చెల్లింపు

3. సంజీవని యోజన ద్వారా 60 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్య సేవలు

4. పెరిగిన నీటి బిల్లుల రద్దు

5. ఢిల్లీ ప్రజలకు వారానికి 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగు నీటి సరఫరా

6. యమునా నది ప్రక్షాళన

7. యూరోపిన్ స్థాయికి ఢిల్లీ రోడ్ల అభివృద్ధి

8. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కాలర్ షిప్స్ (దళిత విద్యార్థుల విదేశీ విద్యకు సాయం)

9. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, మెట్రోలో 50 శాతం రాయితీ

10. పూజారులు, గురుద్వారాలోని గ్రంథీలకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం

11. ఉచిత విద్యుత్, నీరు

12. పాత, బ్లాక్ అయిన మురుగు నీటి లైన్ల మార్పిడి

13. కొత్త రేషన్ కార్డుల జారీ

14. ఆటో డ్రైవర్లు, ఈ-రిక్షా పుల్లర్లకు రూ.10 లక్షల జీవిత భీమా, రూ.5 లక్షల ప్రమాద భీమా. వారి ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1లక్ష సాయం, పిల్లలకు ఉచిత కోచింగ్.

15. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు సొంతగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ నిధులు.

Next Story