కేరళం సీఎం అభ్యర్థి ఎంపికలో జాప్యం..! ‘గాంధీ ముక్త్ కాంగ్రెస్’ పోస్టర్ల కలకలం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-13 11:38:01  IST  )

కేరళలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో జాప్యం పార్టీలో చిచ్చు పెట్టింది.

కేరళం సీఎం అభ్యర్థి ఎంపికలో జాప్యం..! ‘గాంధీ ముక్త్ కాంగ్రెస్’ పోస్టర్ల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళం (Keralam) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 9 రోజులు గడుస్తున్నా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ (UDF) సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడం ఆ పార్టీలో సెగ పుట్టిస్తోంది. పార్టీ హైకమాండ్ తీరు ముఖ్యంగా వాయనాడ్‌ (Wayanad) కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి దారితీస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు ఇప్పుడు కేరళం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. వాయనాడ్‌లోని పలు ప్రాంతాల్లో ‘గాంధీ ముక్త్ కాంగ్రెస్’ అనే నినాదాలతో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

కాగా, కేరళలో కాంగ్రెస్ గెలుపుకు స్థానిక నాయకత్వమే కారణమని, గాంధీ కుటుంబం (The Gandhi Family) జోక్యం వల్లే సీఎం ఎంపికలో అడ్డంకులు ఎదురవుతున్నాయని ఈ పోస్టర్ల ద్వారా కొందరు తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే, సీఎం పదవి కోసం కె.సుధాకరన్, వీడీ సతీశన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. హైకమాండ్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తుండటంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కానీ, ‘గాంధీ ముక్త్ కాంగ్రెస్’ పోస్టర్ల వెనుక పార్టీ ప్రత్యర్థుల కుట్ర ఉందని కాంగ్రెస్ స్థానిక నాయకత్వం ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచిన వాయనాడ్‌లోనే ఇలాంటి పోస్టర్లు ప్రత్యక్షం అవ్వడం పార్టీ అధిష్టానాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Next Story