రక్షణ మంత్రిత్వ శాఖ బిగ్ మూవ్.. 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-12 11:31:16  IST  )

భారత వైమానిక దళాన్ని (IAF) మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో 114 రాఫెల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రక్షణ మంత్రిత్వ శాఖ బిగ్ మూవ్.. 114 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వైమానిక దళాన్ని (IAF) మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో 114 రాఫెల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 88 సింగిల్ సీటర్లు, 26 డబుల్ సీటర్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా కేవలం 18 విమానాలు మాత్రమే ఫ్రాన్స్ నుంచి నేరుగా రానున్నాయి మిగిలిన 90 కంటే ఎక్కువ విమానాలను ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ (Dassault Aviation) సంస్థ సహకారంతో భారత్‌లోనే తయారు చేయనున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల విడి భాగాల తయారీ కోసం హైదరాబాద్‌ (Hyderabad)లో ఓ అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

సరిహద్దుల వెంట ఉద్రిక్తతలతో..

అయితే, ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వద్ద 30 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. ఈ కొత్త విమానాల చేరికతో స్క్వాడ్రన్ల (Squadrons) లోటు భర్తీ కానుంది. ఇప్పటికే ఉన్న 36 రాఫెల్స్, నేవీ కోసం ఆర్డర్ చేసిన 26 విమానాలతో కలిపి భారత్ వద్ద మొత్తం 176 రాఫెల్ యుద్ధ విమానాలు ఉండనున్నాయి. చైనా (China), పాకిస్తాన్ (Pakistan) సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత గగనతల రక్షణను పటిష్టం చేయడం ఈ డీల్ ప్రధాన ఉద్దేశమని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ విమానాల్లో అత్యాధునిక మీటియోర్ (Meteor), స్కాల్ప్ (SCALP) క్షిపణులు ఉంటాయి. ఇవి శత్రువుల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు.

Next Story