Defence Ministry: బీఈఎల్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ భారీ డీల్.. ఎందుకోసమంటే?

by B.Srinivas |

ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోలను సేకరించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.

Defence Ministry: బీఈఎల్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ భారీ డీల్.. ఎందుకోసమంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian coast guard) కోసం 149 సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోలను (Software Defined Radios) సేకరించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)తో రూ.1220 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అగ్రిమెంట్‌పై ఇరు పక్షాలు సంతకం చేసినట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అత్యాధునిక రేడియోల ద్వారా, మరింత సురక్షితమైన, నమ్మదగిన రీతిలో సమాచార మార్పిడి సాధ్యమవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇవి హై-స్పీడ్ డేటా, వాయిస్ కమ్యూనికేషన్‌ల కోసం ఉపయోగించడానికి సురక్షితమైనవని, పరిస్థితులు ఎలా ఉన్నా కమ్యూనికేషన్‌ను సులభతరం చేస్తాయని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా, కోస్ట్ గార్డ్ కార్యాచరణ సామర్థ్యం మెరుగుపడటమే గాక, సముద్ర భద్రతను నిర్ధారించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ బ్లూ ఎకానమీ లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి ఒక వ్యూహాత్మక అడుగు వంటిదని స్పష్టం చేసింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవతో కలిసి, ఈ డీల్ దేశ తయారీ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని తెలిపింది. ఈ డీల్ నేపథ్యంలో గురువారం బీఈఎల్ షేర్లు 2.88శాతం పెరిగాయి. కాగా, ఈ నెల 8న కూడా రక్షణ మంత్రిత్వ శాఖ బీఈఎల్‌తో రూ. 642.17 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది భారత నావికాదళానికి సంబంధించినది.

Next Story