- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా వర్సిటీల్లో తగ్గిన భారతీయ విద్యార్థుల చేరికలు.. వార్షిక నివేదికలో సంచలన విషయాలు
అమెరికాలోని మేనేజ్‌మెంట్ వర్సిటీల్లో భారతీయ విద్యార్థుల చేరికలు ఈ ఏడాది ఏకంగా 45 శాతం పడిపోయాయి.

దిశ, డైనమిక్ బ్యూరో : గత దశాబ్ద కాలంగా ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పట్టిన భారతీయ విద్యార్థుల ధోరణిలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. అమెరికాలోని మేనేజ్‌మెంట్ వర్సిటీల్లో భారతీయ విద్యార్థుల చేరికలు ఈ ఏడాది ఏకంగా 45 శాతం పడిపోయాయి. అదే సమయంలో స్వదేశీ బిజినెస్ స్కూల్స్ (B-Schools)లో చేరే వారి సంఖ్య 25 శాతం పెరగడం గమనార్హం. ఈ మేరకు 'గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్' (GMAC) తన 2025 వార్షిక నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది.
వెనక్కి తగ్గుతున్న విద్యార్థులు.. కారణాలివే!
ఒకప్పుడు భారతీయ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యతగా ఉన్న అమెరికా, ప్రస్తుతం తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలను నివేదిక విశ్లేషించింది. వీసా చిక్కులు.. 2025 మే నెలలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సోషల్ మీడియా వెరిఫికేషన్ నిబంధనల పేరుతో వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయడం పెద్ద దెబ్బ తీసింది. అడ్మిషన్లు పొంది, డిపాజిట్లు కట్టినప్పటికీ వేలాది మంది విద్యార్థులు సకాలంలో వీసాలు పొందలేకపోయారు. ఉద్యోగ భద్రతపై ఆందోళన.. చదువు పూర్తయిన తర్వాత లభించే OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్), H-1B వీసా నిబంధనలు కఠినతరం అవుతాయనే భయం విద్యార్థుల్లో పెరిగింది. భారీగా ఖర్చు చేసి చదివిన తర్వాత అక్కడ ఉద్యోగం దొరకకపోతే ఆర్థికంగా నష్టపోతామని విద్యార్థులు భావిస్తున్నారు. రూపాయి బలహీనత.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోవడంతో, అమెరికాలో చదువు భారం పెరిగింది. దీంతో విద్యార్థులు తక్కువ ఖర్చుతో కూడిన యూరప్ లేదా ఆసియా దేశాల వైపు మొగ్గు చూపుతున్నట్లు నివేదికలో పేర్కొంది.
పెరిగిన స్వదేశీ క్రేజ్
అమెరికాలో అడ్మిషన్లు తగ్గుతుంటే, భారతదేశంలోని మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య స్వదేశంలోనే అందుబాటులో ఉండటం, అప్లికేషన్ల సంఖ్య 25 శాతం పెరగడానికి కారణమైంది. కేవలం భారతీయులే కాకుండా, విదేశీ విద్యార్థులు కూడా భారతీయ బి-స్కూల్స్‌పై ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
మారుతున్న గమ్యస్థానాలు..
అమెరికా, కెనడాలకు ప్రత్యామ్నాయంగా భారతీయ విద్యార్థులు ఇప్పుడు యూరప్ (బ్రిటన్ మినహా), సింగపూర్, ఇతర ఆసియా దేశాల వైపు చూస్తున్నారు. వీసా నిబంధనలు సరళంగా ఉండటం, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య లభించడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






