గుజరాత్‌లో బ్రిడ్జ్ కూలిన ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

by Ramesh Naini |

గుజరాత్‌‌లో గంభీర బ్రిడ్జ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది.

గుజరాత్‌లో బ్రిడ్జ్ కూలిన ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌‌లో (Gambhira bridge collapse incident) గంభీర బ్రిడ్జ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. ఈ మేరకు వడోదర జిల్లా కలెక్టర్ శుక్రవారం అనిల్ ధమేలియా (Anil Dhameliya) మీడియాతో మాట్లాడారు. గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ కోసం.. రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. మిగిలిన మృతదేహాలు స్లాబ్ కింద చిక్కుకున్నాయని, వారిని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే చిక్కుకున్న ట్రక్కు డ్రైవర్ కూడా కనిపించడం లేదని, అతని మృతదేహాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. నది మధ్యలో, 3 నుంచి 4 మీటర్లు ఇసుక ఉందని, ఇది రెస్క్యూ బృందానికి సవాల్‌గా మారిందని చెప్పారు.

ఇక, 1986లో నిర్మించిన గంభీర బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని హెచ్చరికలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని స్థానిక ప్రజలు తీవ్రంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై వివరణ ఇవ్వాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ చేతుల్లోనే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఉంది. ఈ వంతెనకు చేపట్టిన మరమ్మతులు, నాణ్యత పరీక్షల వివరాలతో ఓ నివేదికను సిద్ధం చేయాలని నిపుణులను ఆయన ఆదేశించారు. ఇప్పటికే వంతెన కూలిన ఘటన నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు చెందిన నలుగురు ఇంజినీర్లను సస్పెన్షన్ చేశారు.

కాగా, వడదొర సమీపంలోని మహిమాసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన (జూలై 9) బుధవారం కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు, ఓ ఆటో నదిలో పడిపోయాయి. మరోవైపు బ్రిడ్జ్‌పై ట్యాంకర్ ఇరుక్కుపోయింది. ఇప్పటి వరకు 18 వరకు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story