యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష కేసు.. కాపాడే ప్రయత్నం చేస్తున్న భారత్

by Yella Dhawani Reddy |

యెమెన్‌లో (Yemen) తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (Nimisha Priya)కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష కేసు.. కాపాడే ప్రయత్నం చేస్తున్న భారత్
X

దిశ, వెబ్ డెస్క్: యెమెన్‌లో (Yemen) తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (Nimisha Priya)కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈనెల 16న ఈ శిక్షను అమలు చేయనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరణశిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం (Supreme Court)లో పిటిషన్‌ దాఖలైంది. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. దీనిపై తదుపరి విచారణ ఈనెల 14న ఉండనున్నట్లు తెలిపింది.

అయితే, 16న మరణశిక్ష అమలు నేపథ్యంలో దౌత్య చర్చలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుందని, అది ప్రభావం చూపకపోవచ్చని సీనియర్‌ న్యాయవాది రాజేంత్‌ బసంత్‌ పేర్కొన్నారు. కాబట్టి త్వరగా విచారణ జరపాలని కోరారు. ఈ సందర్భంగా షరియత్‌ చట్టం ప్రకారం బాధిత కుటుంబసభ్యులకు నష్ట పరిహారం చెల్లిస్తే నిమిషను విడుదల చేయవచ్చని ఆయన ధర్మాసనానికి తెలిపారు.

అసలేం జరిగిందంటే?

కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన నిమిష ప్రియ.. నర్సు కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్‌కు వెళ్లారు. 2011లో వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్‌ తెరవాలనుకొన్నారు. యెమెన్‌ చట్టాల ప్రకారం.. క్లినిక్‌ను నడపడానికి లోకల్‌ పార్ట్‌నర్‌ అవసరం. కాబట్టి ఆ దేశానికి చెందిన తలాల్‌ అదిబ్‌ మెహదీని ఆమె వ్యాపార భాగస్వామిగా చేసుకుని, 2015లో సనాలో సొంత క్లినిక్‌ను ప్రారంభించింది. అది కొంతకాలం సజావుగా సాగింది. కానీ కొంత కాలానికే వారి పార్ట్‌నర్‌షిప్‌ దెబ్బతింది. మెహదీ క్లినిక్ నుంచి డబ్బు దొంగిలించి, ఆమె పాస్‌పోర్ట్‌ను తీసుకున్నాడని నిమిష ఆరోపించింది. దీంతో ఆమె యెమెన్‌లో చిక్కుకుపోయింది. 2017లో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. మెహదీకి మత్తుమందు ఇచ్చి, తన పాస్‌పోర్టు లాక్కోవాలని భావించింది. ఈ ప్రయత్నంలో మత్తుమందు మోతాదు ఎక్కువకావడంతో మెహదీ చనిపోయాడు. 2020లో ఆమెకు మరణశిక్ష విధించారు. ఆమె ఫైనల్‌ అప్పీల్ 2023లో రిజెక్ట్‌ అయింది. యెమెన్ తిరుగుబాటుదారుల నేతృత్వంలోని ప్రభుత్వం 2025 ప్రారంభంలో ఆమెను ఉరితీయడానికి ఆమోదం తెలిపింది. గత ఏడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇచ్చి తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేదు.

Next Story