- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై మయన్మార్ ప్రభుత్వం ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ స్కామ్ కేంద్రాల్లో పనిచేయడానికి ప్రజలను అక్రమంగా నిర్బంధించి, వారిపై తీవ్ర హింసకు పాల్పడే నేరస్థులకు ఉరిశిక్ష విధించే అధికారాలను ఇస్తూ రూపొందించిన నూతన చట్టానికి మయన్మార్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మయన్మార్ రాజధాని నెపిడా (Naypyidaw)లో ఇవాళ జరిగిన ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో యాంటీ-ఆన్‌లైన్ స్కామ్ బిల్లు (Anti-Online Scam Bill)ను ప్రతినిధులు ఆమోదించినట్లుగా యూనియన్ పార్లమెంట్ స్పీకర్ ఆంగ్ లిన్ ద్వే వెల్లడించారు. బిల్లు ముసాయిదాలో ఎలాంటి మార్పులు లేకుండానే మరణశిక్ష నిబంధనను యథాతథంగా ఆమోదించినట్లుగా దిగువ సభ ఎంపీ ఏ చాంగ్ ధృవీకరించారు.
కఠిన శిక్షలు, నిబంధనలు ఇలా..
ఆన్‌లైన్ స్కామ్‌లు చేయాలని ఒత్తిడి తెస్తూ వ్యక్తులను అక్రమంగా బంధించడం, తీవ్రంగా హింసించడం, క్రూరంగా ప్రవర్తించడం వంటి నేరాలకు పాల్పడితే 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధిస్తారు. ఒకవేళ ఈ హింస కారణంగా బాధితుడు మరణిస్తే నేరస్థులకు తప్పనిసరిగా ఉరిశిక్ష విధిస్తారు. అదేవిధంగా ఆన్‌లైన్ స్కామ్ కేంద్రాలను (Scam Hubs) నడిపే వారికి, క్రిప్టోకరెన్సీ, డిజిటల్ కరెన్సీ మోసాలకు పాల్పడేవారికి గరిష్ఠంగా జీవిత ఖైదు విధించేలా చట్టంలో నిబంధనలు చేర్చారు. కాగా, మయన్మార్‌లో అక్రమంగా నడుస్తున్న ఆన్‌లైన్ స్కామ్ సెంటర్లు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల మోసాలకు వేదికగా మారాయి. విదేశాల నుంచి ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా (Human Trafficking) ద్వారా తీసుకువచ్చిన వ్యక్తులను కాల్ సెంటర్లలో బంధించి, బలవంతంగా క్రిప్టో, డెటింగ్ మోసాలు చేయిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో యాంటీ-ఆన్‌లైన్ స్కామ్ బిల్లుకు ఆమోదం తెలపడం విశేషం.






