ISIS Chief : ఐసిస్ గ్లోబర్ ఆపరేషన్స్ చీఫ్ అబు ఖదీజా హతం

by Shamantha N |   (  Updated:2025-03-15 18:06:18  IST  )

ఇరాక్ లో అమెరికా చేసిన వైమానిక దాడిలోఇస్లామిక్‌ స్టేట్‌ (ISIS) గ్లోబల్‌ ఆపరేషన్స్‌ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్‌ అల్‌ రిఫాయ్‌ అలియాస్‌ అబు ఖదీజా హతమయ్యాడు.

ISIS Chief : ఐసిస్ గ్లోబర్ ఆపరేషన్స్ చీఫ్ అబు ఖదీజా హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాక్ లో అమెరికా చేసిన వైమానిక దాడిలోఇస్లామిక్‌ స్టేట్‌ (ISIS) గ్లోబల్‌ ఆపరేషన్స్‌ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్‌ అల్‌ రిఫాయ్‌ అలియాస్‌ అబు ఖదీజా హతమయ్యాడు. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సంయుక్త సహకారంలో అగ్రరాజ్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. అబు ఖదీజా కారులో వెళ్తుండగా అమెరికా దళాలు మిస్సైల్ ని ప్రయోగించి అతడ్ని చంపేశాయి. దీనికి సంబంధించిన విజువల్స్ ని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) రిలీజ్ చేసింది. అతడితో పాటు మరో ఐసిస్‌ ఉగ్రవాది కూడా చనిపోయినట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. దాడి తర్వాత ఇద్దరి డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, చనిపోయిన వారి శరీరాలకు ఆత్మాహుతి బాంబులు అమర్చి ఉన్నాయని.. అంతేకాకుండా ఆయుధాలు కూడా వెంట ఉన్నట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. అయితే, గతంలో ఓ ఆపరేషన్ నుంచి అబు ఖదీజా త్రుటిలో తప్పించుకోగా.. అప్పట్లో అతడి డీఎన్ఏ నమూనాను సేకరించారు. దాని ఆధారంగానే డీఎన్ఏ టెస్టులు చేపట్టి ఖదీజా మృతిని గుర్తించారు. మార్చి 13న జరిగిన ఈ సీక్రెట్‌ ఆపరేషన్‌ వివరాలు ప్రస్తుతం బయటికొచ్చాయి.

మరణవార్తను ధ్రువీకరించిన ఇరాక్

తొలుత ఇరాక్‌ ప్రధాని అబూ ఖదీజా మృతి వార్తను ప్రకటించారు. ఇరాక్ ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా అల్-సుడానీ ఈ ఆపరేషన్‌ను ప్రశంసించారు. అబూ ఖదీజాను "ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో ఒకరు" అని ఆయన అభివర్ణించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా స్పందించారు. ‘‘ఇరాక్‌లో ఐసిస్‌ అగ్రనేతను హతమార్చాం. అతడి కోసం మా ధైర్యవంతమైన యుద్ధ యోధులు నిర్విరామంగా వేటాడారు. ఇప్పుడు అతడి దుర్భర జీవితం ముగిసింది. బలంతోనే శాంతిని సాధించాం’’ అని తన ట్రూత్‌ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్ పై అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా స్పందించారు. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐసిస్ సంస్థలో అబూ ఖదీజా అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మేం ఈ ప్రాంతంలో ఉగ్రవాదులను చంపడం, వెలుపల మన మాతృభూమిని, అమెరికా, మిత్రరాజ్యాలను బెదిరించే సంస్థలను అంతం చేయడం కొనసాగిస్తాం" అని మైఖేల్ ఎరిక్ కురిల్లా అన్నారు.

అబు ఖదీజా ఎవరంటే?

అబు ఖదీజా ఐసిస్‌ ముఠాలో రెండో అత్యంత శక్తిమంతమైన నాయకుడు. ఈ సంస్థ గ్లోబల్‌ ఆపరేషన్స్‌ను పర్యవేక్షిస్తున్న అతడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర ఉగ్రవాదుల్లో ఒకడు. 2023లో అతడిపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఐసిస్‌కు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ భద్రతా దళం కొన్నేళ్లుగా కీలక మిలిటరీ ఆపరేషన్లు చేపట్టింది. ఫలితంగా 2017 నాటికి ఇరాక్‌, 2019 నాటికి సిరియాలో ఈ సంస్థను చాలావరకు నిర్వీర్యం చేశారు. అయినప్పటికీ ఈ రెండు దేశాల్లో మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ గ్రూప్‌ నాయకులు నక్కి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.

READ MORE ...

మార్పు తీసుకొద్దాం.. బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి: నెటిజన్లకు సజ్జనార్ సందేశం

మీడియా రిపోర్టర్‌ల మంటూ.. రూ.10 వేలు డిమాండ్.. చాకచక్యంగా వ్యవహరించిన హాస్పిటల్ మేనేజ్మెంట్






Next Story