Los Angeles wildfires: లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు.. 16 కు చేరిన మృతుల సంఖ్య

by Shamantha N |
Los Angeles wildfires: లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు.. 16 కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: లాస్‌ఏంజెల్స్‌లో కార్చిచ్చు (Los Angeles wildfires) వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా లేదు. ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటివరకు కార్చిచ్చు వల్ల 16 మంది చనిపోయారు.. ఒక్క ఎటోన్‌ ఫైర్‌లోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. 37 వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. 12 వేల నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి. ఎల్.ఏ కౌంటీ షరీఫ్ లో 13 మంది మిస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 1.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. పాలిసేడ్స్‌ ఫైర్‌ను 11శాతం అదుపు చేయగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది బ్రెంట్‌వుడ్‌ వైపు మళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోనే లిబ్రోన్‌ జేమ్స్‌, ఆర్నాల్డ్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ నివాసాలు ఉన్నాయి. ఇక్కడి పరిస్థితి కారణంగా ఆమె తన చిట్టచివరి విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక మరోవైపు ఎటోన్‌ ఫైర్‌ మాత్రం కట్టడి కాలేదు.

నీటి ఎద్దడే కారణం..

లాస్‌ ఏంజెలెస్‌లోని కార్చిచ్చులను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తగినన్ని నీళ్లు లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ‘‘నీళ్లు లేకుండా మంటలు ఎలా అదుపు చేస్తాం’’ అని అగ్నిమాపక సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. భారీస్థాయిలో మంటలను అదుపు చేసే ప్రణాళికలు స్థానిక యంత్రాంగం దగ్గర లేకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్‌ లేదా వాణిజ్య భవనాల మంటలను అదుపు చేయడానికి సరిపడా వ్యవస్థ మాత్రమే ప్రస్తుతం ఉంది. అంతకుమించి మంటలు వ్యాపిస్తే.. విమానాలను రంగంలోకి దిగుతాయి. అయితే మంగళ, బుధవారాల్లో గాలులు విపరీతంగా వీయడంతో విమాన సేవలను వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే, లాస్ ఏంజిల్స్ హెల్త్ అధికారులు అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పొగ వల్ల దీర్ఘకాలిక ముప్పులను వస్తాయని హెచ్చరించారు. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed