Pahalgam attack: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ లో కీలక సమావేశం

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడితో తర్వాత మరో కీలక పరిణామం జరిగింది. దాడి జరిగిన మరుసటి రోజే లష్కరే తోయిబా నేత ఇజార్ తో తాత్కాలిక ప్రభుత్వంలోని లీగల్ అడ్వైజర్ డాక్టర్ అసిఫ్ నజ్రుల్ భేటీ అయినట్లు తెలుస్తోంది.

Pahalgam attack: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ లో కీలక సమావేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడితో తర్వాత మరో కీలక పరిణామం జరిగింది. దాడి జరిగిన మరుసటి రోజే లష్కరే తోయిబా నేత ఇజార్ తో తాత్కాలిక ప్రభుత్వంలోని లీగల్ అడ్వైజర్ డాక్టర్ అసిఫ్ నజ్రుల్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఢాకాలో ఈ సమావేశం జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఉగ్రవాదం విషయంలో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ విధానంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ఇజార్ గతంలో ఉగ్రదాడులకు పాల్పడిన చరిత్ర ఉంది. హెఫాజత్-ఇ-ఇస్లాం వంటి గ్రూపులతో, రాడికల్ సిద్ధాంతాలతో అతడికి అనుబంధం ఉంది. కాగా.. ఢాకాలో జరిగిన ఈ భేటీపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, బంగ్లాదేశ్‌ మాత్రం దీనిపై వేరుగా స్పందించింది. అసిఫ్ నజ్రుల్, ఇజార్‌ల మధ్య భేటీ ఏప్రిల్ 21న జరిగిందని పేర్కొంది. అది పహెల్గాం దాడి జరగడానికి ముందురోజు. పలువురు ఇస్లామిస్టులపై దాఖలైన వేధింపుల కేసుల ఉపసంహరణ నిమిత్తం ఈ సమావేశం జరిగిందని వెల్లడించింది.

పాక్ కు అనుకూలంగా బంగ్లా..

భారతదేశంతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో బంగ్లాదేశ్... పాకిస్థాన్‌కు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. 15 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్- బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శులు ఇటీవలే ఢాకాలో సమావేశమై పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద అనుబంధ చరిత్ర కలిగిన పార్టీ అయిన జమాతే-ఇ-ఇస్లామీపై నిషేధాన్ని రద్దు చేయాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, పహల్గాంలో ఉగ్రదాడికి తెగబడింది తామేనని ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ ఇప్పటికే ప్రకటించుకుంది. అయితే దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే అయినా.. చేయించింది మాత్రం లష్కరే తోయిబా చీఫ్, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏప్రిల్ 22న పహెల్గాంలో పర్యాటకులపై ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు.

Next Story