- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 1500 పెన్షన్ కోసం.. 9 కిలోమీటర్లు అత్తను భుజాలపై మోసిన కోడలు!
అభాగ్యులకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వ పథకాలు.. నిబంధనల ఉచ్చులో పడి వృద్ధులకు శాపంగా మారుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: అభాగ్యులకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వ పథకాలు.. నిబంధనల ఉచ్చులో పడి వృద్ధులకు శాపంగా మారుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస సదుపాయాలు లేని మారుమూల గ్రామాల్లో సంక్షేమ పథకాల డెలివరీ ఎలా ఉందో ఎత్తిచూపుతూ ఛత్తీస్‌గఢ్‌లో ఒక హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. కేవలం రూ.1500 పెన్షన్ కోసం 55 ఏళ్ల కోడలు తన 90 ఏళ్ల అత్తను ఏకంగా 9 కిలోమీటర్ల మేర భుజాలపై మోసుకుంటూ బ్యాంకుకు తీసుకెళ్లిన తీరు అందరినీ కలచివేస్తోంది.
విక్రమార్కుడు - భేతాళుడి కథను తలపిస్తూ..
విక్రమార్కుడు - భేతాళుడి కథను తలపిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా మెయిన్‌పాట్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నెట్టింట వీడియో, స్థానిక వివరాల ప్రకారం.. సుఖ్‌మనియా బాయి (55) అనే మహిళ తన అత్త సోన్‌వారీ (90)తో కలిసి నివసిస్తోంది. సోన్‌వారీకి రావాల్సిన వృద్ధాప్య పింఛను కేవైసీ (KYC) సమస్యల వల్ల గత మూడు నెలలుగా నిలిచిపోయినట్లు (రూ. 1500) తెలుస్తోంది. లబ్ధిదారురాలు స్వయంగా బ్యాంకుకు వచ్చి వేలిముద్రలు వేసి, గుర్తింపును ధృవీకరిస్తేనే (Physical Verification) పెన్షన్ డబ్బులు ఇస్తామని అధికారులు తేల్చిచెప్పినట్లు జాతీయ మీడియా సమాచారం. దీంతో నడవలేని వృద్ధాప్య స్థితిలో ఉన్న అత్తకు పెన్షన్ ఇప్పించడం కోసం గత్యంతరం లేక సుఖ్‌మనియా బాయి ఆమెను తన వీపుపై ఎక్కించుకుని మండుటెండలో 9 కిలోమీటర్ల మేర అడవి మార్గంలో నడిచింది. ఆ గిరిజన గ్రామానికి కనీస రవాణా సౌకర్యాలు లేవు. బ్యాంకుకు వెళ్లాలంటే అడవులు, వాగులు, రాళ్ల దారుల గుండా నడుచుకుంటూ వెళ్లాల్సిందే.
డిజిటల్ ఇండియా క్షేత్రస్థాయి వాస్తవం ఇదేనా?
ఈ హృదయవిదారక దృశ్యాలను దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీడియోలో ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ఆ కోడలు సమాధానమిస్తూ.. ‘బ్యాంకుకు తీసుకెళ్తే తప్ప పెన్షన్ ఇవ్వరు. ఇక్కడ బస్సులు, ఆటోలు ఏమీ లేవు. అడవి గుండా, వాగులు దాటుకుంటూ వెళ్లాలి.’ అని తన ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పెన్షన్ డబ్బులు స్థానికంగానే (గ్రామంలోనే) అందేవని, ఇప్పుడు ఆ సదుపాయం పనిచేయకపోవడంతో ఇలా కష్టపడాల్సి వస్తోందని వాపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. మంచానపడ్డ వృద్ధులకు ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే అందిస్తున్నామని, ‘డిజిటల్ ఇండియా’ ద్వారా అంతా సులభతరం అయిందని ప్రభుత్వాలు చెబుతున్న మాటలన్నీ క్షేత్రస్థాయిలో నీటిమూటలేనని విమర్శిస్తున్నారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, అధికారులకు, నేతలకు నెటిజన్‌లు ట్యాగ్ చేశారు.






