Viral : యమునా నదిలో ప్రమాదకర ‘నురగ’.. మంచు అనుకొని విషంతో చిన్నారుల ఆటలు!

by Ramesh Naini |

దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యం పరాకాష్టకు చేరింది. తాజాగా కాళింది కుంజ్ సమీపంలో నదిపై మంచులా పేరుకుపోయిన పారిశ్రామిక వ్యర్థాల నురగలో చిన్నారులు ఆడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Viral : యమునా నదిలో ప్రమాదకర ‘నురగ’.. మంచు అనుకొని విషంతో చిన్నారుల ఆటలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యం పరాకాష్టకు చేరింది. తాజాగా కాళింది కుంజ్ సమీపంలో నదిపై మంచులా పేరుకుపోయిన పారిశ్రామిక వ్యర్థాల నురగలో చిన్నారులు ఆడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరల్ వీడియో ప్రకారం.. నదిలో పేరుకుపోయిన తెల్లటి నురగలో చిన్నారులు అందులోకి దిగి కేరింతలు కొడుతున్నారు. నురగను చూసి ఆటలాడుకున్నారు. అది మంచు నురగ అని భ్రమపడి చిన్నారులు ఆటలాడుతున్నట్లు నెటిజన్‌లు చెబుతున్నారు. అయితే, అది సాధారణ నురగ కాదు.. ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే ప్రమాదకరమైన ఫాస్ఫేట్లు, డిటర్జెంట్లు, ఇతర పారిశ్రామిక రసాయనాల కలయికతో ఏర్పడిన 'టాక్సిక్ ఫోమ్' (విషపు నురగ) అని నిపుణులు చెబుతున్నారు. ఈ నురగలో గంటల తరబడి గడపడం వల్ల చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీ నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం

యమునా నది కేవలం ఒక పవిత్ర నది మాత్రమే కాదు, ఢిల్లీకి అవసరమైన తాగునీటిలో దాదాపు 40% ఇక్కడి నుండే లభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, నదిలో అమ్మోనియా స్థాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో నీటి శుద్ధి ప్రక్రియ స్తంభించి పోతున్నట్లు సమాచారం. దీనివల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోందని, ప్రభుత్వాలు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నా, యమునను ప్రక్షాళన చేయడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Next Story