టర్కీలో ‘డి-కంపెనీ’ కింగ్ పిన్ సలీం డోలా అరెస్ట్: రూ.5 కోట్ల డ్రగ్ సామ్రాజ్యానికి చెక్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-28 04:54:09  IST  )

భారత్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, డ్రగ్ కింగ్ పిన్ సలీం ఇస్మాయిల్ డోలా టర్కీలో అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు అతడిని ఇవాళ సీబీఐ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు.

టర్కీలో ‘డి-కంపెనీ’ కింగ్ పిన్ సలీం డోలా అరెస్ట్: రూ.5 కోట్ల డ్రగ్ సామ్రాజ్యానికి చెక్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ డ్రగ్స్ మార్కెట్‌లో కీలక సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు సలీం ఇస్మాయిల్ డోలా (Salim Ismail Dola)ను టర్కీ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఈ మేరకు ఇవాళ ఉదయం అతడిని సీబీఐ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. దాదాపు పదేళ్లుగా భారత ఏజెన్సీలకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఈ డ్రగ్ మాఫియా డాన్‌ను ఇస్తాంబుల్‌లోని బెయిలిక్దుజు జిల్లాలో నేషనల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (MIT) అదుపులోకి తీసుకుంది. అయితే, ముంబైలోని బైకుల్లా ప్రాంతానికి చెందిన సలీం డోలా, తొలినాళ్లలో గుట్కా సరఫరా చేస్తూ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడైన చోటా షకీల్‌తో స్నేహం చేసి, నెమ్మదిగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు.

రూ.5000 కోట్ల నెట్‌వర్క్..

సలీం డోలా కేవలం భారత్‌లోనే కాకుండా సౌతాఫ్రికా, మెక్సికన్ కార్టెల్స్‌తో సంబంధాలు కలిగి ఉండి, ఏడాదికి దాదాపు రూ.5,000 కోట్ల విలువైన సింథటిక్ డ్రగ్స్ అందులో ముఖ్యంగా మెఫెడ్రోన్ - MD, ఫెంటానిల్ వ్యాపారాన్ని నడుపుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా అతడు యూఏఈ (UAE)కి చెందిన నకిలీ గుర్తింపు కార్డులతో టర్కీలో తలదాచుకుంటున్నాడు. సలీం డోలాపై ఇప్పటికే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ముంబై క్రైమ్ బ్రాంచ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), సీబీఐ (CBI) గత కొంతకాలంగా ఇతని కదలికలపై నిఘా ఉంచాయి. ఈ మేరకు గతేడాది సలీం డోలా కుమారుడు తాహెర్ డోలాను యూఏఈ నుంచి భారత్‌కు రప్పించడంలో భద్రతా సంస్థలు విజయం సాధించాయి. అతడి ద్వారా లభించిన సమాచారంతోనే సలీం డోలాను టర్కీలో పట్టుకోవడం సాధ్యమైంది.

భారత్‌కు అప్పగింత..

భారత్, టర్కీల మధ్య నేరుగా నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోయినప్పటికీ, అంతర్జాతీయ సహకారం, రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతడిని ఇవాళ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు డ్రగ్స్ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన వనరు. ఇప్పుడు సలీం డోలా అరెస్ట్‌తో ఈ సిండికేట్ ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని, ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించిన డ్రగ్ నెట్‌వర్క్‌ను కూల్చివేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Next Story