ఢిల్లీ హైకోర్టు విచారణలో అశ్లీల వీడియోల కలకలం.. చీఫ్ జస్టిస్‌కు చేదు అనుభవం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-29 09:39:10  IST  )

ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు జరుగుతున్న వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు ప్లే కావడంతో తీవ్ర కలకలం రేగింది.

ఢిల్లీ హైకోర్టు విచారణలో అశ్లీల వీడియోల కలకలం.. చీఫ్ జస్టిస్‌కు చేదు అనుభవం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు జరుగుతున్న వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు ప్లే కావడంతో తీవ్ర కలకలం రేగింది. చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజాస్ కారియాతో కూడిన డివిజన్ బెంచ్ ముందు వర్చువల్ కాన్ఫరెన్సింగ్ (VC) ద్వారా విచారణ జరుగుతుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కోర్టు తన సప్లిమెంటరీ జాబితాను పరిశీలిస్తున్న సమయంలో, “Shitjeet Sighn” అనే పేరుతో లాగిన్ అయిన ఒక అపరిచిత వ్యక్తి హఠాత్తుగా స్క్రీన్ షేర్ చేసి అశ్లీల కంటెంట్‌ను ప్లే చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కోర్టు సిబ్బంది వర్చువల్ లింక్‌ను నిలిపివేశారు.

హ్యాకర్ల హెచ్చరిక.. పదే పదే అంతరాయం

వర్చువల్ లింక్‌ను పునరుద్ధరించిన కొద్దిసేపటికే.. అదే యూజర్ మళ్లీ లాగిన్ అయ్యి రెండోసారి అశ్లీల వీడియోలను ప్రదర్శించాడు. కోర్టు సిబ్బంది రెండోసారి కూడా మీటింగ్‌ను షట్ డౌన్ చేశారు. అయితే.. మూడోసారి కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఈ సమయంలో "ఇది అమెరికా నుంచి జరిగిన హ్యాకింగ్.. మీటింగ్ ఇప్పుడే ఆపేయండి, మళ్లీ ఆన్ చేయవద్దు" అనే వాయిస్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించింది. దీనివల్ల విచారణకు తీవ్ర అంతరాయం కలగడంతో కాసేపటి వరకు విజువల్స్, ఆడియోను పూర్తిగా నిలిపివేశారు.

పోలీసులకు ఫిర్యాదు: సైబర్ భద్రతపై విచారణ

ఈ తీవ్రమైన భద్రతా ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వర్చువల్ విచారణలో అనధికారిక జోక్యం, భద్రతా లోపాలపై ఢిల్లీ పోలీసుల ఐఎఫ్ఎస్ఓ (IFSO) యూనిట్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ ప్రారంభించిన పోలీసులు, ఆ హ్యాకర్ ఎక్కడి నుంచి లాగిన్ అయ్యాడు. ఈ ఘటన వెనుక ఉన్న వారెవరనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం వర్చువల్ మీటింగ్‌లో పాల్గొనేవారిని లాక్ చేసి కఠిన నిబంధనల మధ్య విచారణ కొనసాగిస్తున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు మ‌ృతి

Next Story