Droupadi Murmu: సైబర్ నేరాలు, డీప్ ఫేక్ పట్ల అప్రమత్తంగా ఉండాలి- ముర్ము

by Shamantha N |

సైబర్ నేరాలు, డీప్ ఫేక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) అన్నారు.

Droupadi Murmu: సైబర్ నేరాలు, డీప్ ఫేక్ పట్ల అప్రమత్తంగా ఉండాలి- ముర్ము
X

దిశ, నేషనల్ బ్యూరో: సైబర్ నేరాలు, డీప్ ఫేక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) అన్నారు. ‘మానవ హక్కుల దినోత్సవం’ (Human Rights Day) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సవాళ్లు పొంచిఉన్నాయని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ త్వరగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్‌ నేరాలు, డీప్‌ ఫేక్‌, ప్రజల గోప్యతకు భంగం వంటి విషయాలు మనకు కొత్త ముప్పుగా మారాయన్నారు. వీటిని నివారించాలంటే ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్‌ వాతావరణాన్ని కల్పించడం చాలా ముఖ్యమని అన్నారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరాలతో పాటు వాతావరణంలో వచ్చే వివిధ రకాల మార్పులను ఎదుర్కొంటోందని ముర్ము అన్నారు.

ఏఐ గురించి..

ప్రజల జీవితాల్లో ఏఐ ప్రభావం గురించి ముర్ము మాట్లాడారు. ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజూవారీ జీవితంలోకి ప్రవేశించింది. మన సమస్యలను పరిష్కరిస్తోంది. కానీ మనకు తెలియకుండానే కొత్త సమస్యలను సృష్టిస్తోంది. దీనికి ప్రాణం లేకపోయినా సృష్టించింది మానవులే కాబట్టి.. ఈ సవాళ్లకు మనమే తగిన పరిష్కారం కనుగొనాల్సిన అవసరముంది’’ అని తెలిపారు. ఇకపోతే, మానవ హక్కుల పరిరక్షణ ప్రకటనను ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1948లో ఆమోదించింది. ఆ తీర్మానంలో రూపొందించిన హక్కులు, స్వేచ్ఛపై అందరిలోను అవగాహన పెంచేందుకు ఏటా డిసెంబరు 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా రూపొందించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాకారం చేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

Next Story