PM Modi: సున్నాసీట్లు వచ్చిన వారు ఇందులోని సున్నాలను లెక్కించలేరు- మోడీ

by Shamantha N |

కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) విమర్శలు గుప్పించారు. ముద్రా యోజన గురించి ప్రస్తావిస్తూ.. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల గురించి ఎద్దేవా చేశారు.

PM Modi: సున్నాసీట్లు వచ్చిన వారు ఇందులోని సున్నాలను లెక్కించలేరు- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) విమర్శలు గుప్పించారు. ముద్రా యోజన గురించి ప్రస్తావిస్తూ.. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల గురించి ఎద్దేవా చేశారు. సూరత్‌లో ఆహార భద్రత సంతృప్త ప్రచారం ప్రారంభోత్స కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖాతా తెరవకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఈ విధంగా స్పందించారు. సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ముద్రా’ యోజన (MUDRA Yojana) కింద రూ.32 లక్షల కోట్ల రుణాలను ఇచ్చామని పేర్కొన్నారు. సున్నా సీట్లు వచ్చిన వారు ఇందులో ఎన్ని సున్నాలు ఉంటాయో లెక్కించలేరంటూ విపక్షాలపై చురకలు అంటించారు. ఐదు కోట్ల నకిలీ రేషన్‌ కార్డులను ఏరివేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించినట్లు చెప్పుకొచ్చారు. ఆహార భద్రతా లక్ష్యాలను సాధించేందుకు సూరత్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమం అన్ని జిల్లాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

స్థూలకాయాన్ని ఓడించేందుకు..

స్థూలకాయాన్ని ఓడించడానికి ప్రధాని మోడీ ప్రజలకు ఒక మంత్రాన్ని కూడా చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీలోని సిల్వాసాలో రూ. 2,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. ఆ తర్వాత ఊభకాయం సమస్యను ఆయన ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడుతారని ప్రధానమంత్రి ఒక నివేదికను ఉటంకిస్తూ అన్నారు. ప్రధానమంత్రి ఈ గణాంకాలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు. గతంలో చెప్పిన సూత్రాన్నే మరోసారి గుర్తుచేశారు. ప్రజలు వంట నూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని అన్నారు. తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు జీవనశైలిపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా 25 వేల జన ఔషధి కేంద్రాలను ప్రారంభిస్తుందని… తద్వారా ప్రజలు సరసమైన, నాణ్యమైన జనరిక్ ఔషధాలను పొందగలరన్నారు.

Next Story