Hantavirus outbreak: అంటార్కిటికాలో అడ్వెంచర్‌కు వెళ్లిన ఓడలో హంటావైరస్ కలకలం

by S Gopi |

నెదర్లాండ్స్‌కు చెందిన ఓషియన్‌వైడ్ ఎక్స్‌పెడిషన్ నిర్వహిస్తున్న ఎంవీ హోండియస్ అర్జెంటీనా నుంచి అంటార్కిటికా వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Hantavirus outbreak: అంటార్కిటికాలో అడ్వెంచర్‌కు వెళ్లిన ఓడలో హంటావైరస్ కలకలం
X

దిశ, నేషనల్ బ్యూరో: అట్లాంటిక్ మహాసముద్రంలో అడ్వెంచర్‌కు వెళ్లిన క్రూజ్ నౌకలో అరుదైన వైరస్ కలకలం రేపుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ), నౌక నిర్వాహకుల సమాచారం ప్రకారం, అరుదైన హంటావైరస్ వ్యాప్తి అనుమానంతో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 150 మందితో ఉన్న ఈ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలోని కేప్ వర్డె తీరానికి సమీపంలో సహాయం కోసం నిలిచిపోయింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఓషియన్‌వైడ్ ఎక్స్‌పెడిషన్ నిర్వహిస్తున్న ఎంవీ హోండియస్ అర్జెంటీనా నుంచి అంటార్కిటికా వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేప్ వర్డెకు చేరుకున్న తర్వాత సహాయం కోసం నౌకలోని వారు స్థానిక అధికారులను అభ్యర్థించారు. కానీ, ప్రజారోగ్య ఆందోళనల దృష్ట్యా తమ రేవులో ఆ నౌకను నిలిపేందుకు అనుమతి ఇవ్వలేదని కేప్‌ వర్డె ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. దీంతో నౌక తీరానికి సమీపంలోని సముద్రంలోనే నిలిచిపోయింది. నౌకలో 88 మంది ప్రయాణికులు, 60 మంది సిబ్బంది ఉన్నారు.

వ్యాధి ఎలా వ్యాపించిందనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. హంటావైరస్ సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపించే అరుదైన వైరస్ అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో మనుషుల మధ్య కూడా వ్యాపించే అవకాశముందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇప్పటికే ఒక బ్రిటిష్ పౌరుడికి ఈ వైరస్ నిర్ధారణ కాగా, అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరికొందరు సిబ్బంది కూడా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేప్ వర్డె ప్రభుత్వం వైద్య బృందాన్ని నౌకకు పంపింది. ప్రయాణికులను సురక్షితంగా తరలించే చర్యలపై అధికారులు పని చేస్తున్నారు. అవసరమైతే స్పెయిన్‌లోని టెనెరిఫ్ వంటి ఓడరేవులకు తరలించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుండగా, ప్రయాణికులు, సిబ్బందికి వైద్య సహాయం అందిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

Next Story