ఎల్‌పీజీ అక్రమ నిల్వల దందా.. 610 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన క్రైమ్ బ్రాంచ్

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా గ్యాస్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో ఎల్‌పీజీ సిలిండర్ల అక్రమ నిల్వల దందా బయటపడింది.

ఎల్‌పీజీ అక్రమ నిల్వల దందా.. 610 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన క్రైమ్ బ్రాంచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా గ్యాస్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో ఎల్‌పీజీ సిలిండర్ల అక్రమ నిల్వల దందా బయటపడింది. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సోమవారం ఢిల్లీ నగరంలోని ముండ్కా ప్రాంతంలో ఉన్న ఓ గోదాంపై దాడులు నిర్వహించి 610 ఎల్‌పీజీ సిలిండర్లను సీజ్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీలకు చెందిన సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేందుకు ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఉందన్న ప్రచారం నేపథ్యంలో కొంతమంది అక్రమంగా సిలిండర్లను నిల్వ చేసి అధిక ధరలకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అయితే దేశంలో ఎల్‌పీజీ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశంలోని అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ఎక్కడా గ్యాస్ సరఫరా నిలిచిపోయిన ఘటనలు నమోదు కాలేదని తెలిపారు.

నిరంతరాయంగా ఎల్‌పీజీ సరఫరా..

ఇక గృహ వినియోగదారులకు నిరంతరాయంగా ఎల్‌పీజీ సరఫరా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సాధ్యమైన చోట్ల వినియోగదారులు పైప్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్లకు మారాలని ప్రభుత్వం సూచించింది. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ విక్రయాలపై పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం గ్యాస్ సరఫరాపై అపోహలు నమ్మకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Next Story