CPIM vs BJP: పార్లమెంట్ గేటు వద్ద ఎంపీల ప్రత్యక్ష ఘర్షణ

by Gantepaka Srikanth |   (  Updated:2026-07-23 07:09:11  IST  )

నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిని, పార్లమెంట్ పరిసరాలను తీవ్రంగా ఉడేక్కిస్తోంది.

CPIM vs BJP: పార్లమెంట్ గేటు వద్ద ఎంపీల ప్రత్యక్ష ఘర్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిని, పార్లమెంట్ పరిసరాలను తీవ్రంగా ఉడేక్కిస్తోంది. గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని 'మకర్ ద్వార్' వద్ద విపక్ష 'ఇండియా' (INDIA) కూటమి, అధికార 'ఎన్డీఏ' (NDA) కూటమీ ఎంపీలు ముఖాముఖీ నిరసనలకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మకర్ ద్వార్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో విపక్షాల వైఖరిని నిరసిస్తూ ఎన్డీఏ ఎంపీలు కూడా ఎదురెదురుగా నిరసనకు దిగారు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ చేతిలో ఉన్న ప్లకార్డు బీజేపీ ఎంపీ అరుణ్ సింగ్ బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

పరిస్థితి చేయిదాటిపోయేలా కనిపించడంతో వెంటనే రంగంలోకి దిగిన పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది 'హ్యూమన్ చైన్' (మానవ హారం)గా ఏర్పడి ఇరువర్గాల ఎంపీలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ భారీగా భద్రతను పెంచారు. బయట నిరసనల సెగ లోపల సభలపైనా తీవ్ర ప్రభావం చూపింది. సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనలు, భీకర నినాదాల మధ్య సభను నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో స్పీకర్ ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ వ్యవహారంపై సమగ్ర చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతుండటంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Next Story