Covid: దేశంలో మరోసారి కొవిడ్ వేవ్.. 11 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు

by B.Srinivas |   (  Updated:2025-05-22 19:02:05  IST  )

ప్రపంచాన్ని వణికించిన కరోనా మరోసారి దూసుకొస్తున్నది. అనేక రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Covid: దేశంలో మరోసారి కొవిడ్ వేవ్.. 11 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి దూసుకొస్తున్నది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తమిళనాడు, హర్యానా, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, సిక్కిం, రాజస్థాన్, కర్ణాటకల్లో యాక్టివ్ కేసులున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య ప్రతినిధులతో ఇటీవల సమావేశమైంది. అయితే ప్రస్తుతం నివేదించబడిన అన్ని కేసులు తేలికపాటి లక్షణాలను మాత్రమే కలిగి ఉన్నాయని, ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. ముంబై, చెన్నయ్, అహ్మదాబాద్ వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కేసులు భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మే నెలలో ముంబైలో మాత్రమే 95 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 106 కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక తమిళనాడులోనూ కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. పుదుచ్చేరిలో 12 కొత్త కేసులు వెలుగు చూశాయి. అంతేగాక కర్ణాటకలో 16 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఒకే రోజులో ఏడు కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

Next Story