Covid: గడిచిన 24 గంటల్లో నలుగురిని బలిగొన్న కొవిడ్

by S Gopi |

కేరళలో 127, గుజరాత్‌లో 102, ఢిల్లీలో 73, పశ్చిమ బెంగాల్‌లో 26 కొత్త కేసులు నమోదయ్యాయి.

Covid: గడిచిన 24 గంటల్లో నలుగురిని బలిగొన్న కొవిడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కొవిడ్-19 కేసుల రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కొవిడ్-19 కేసులు 5,755కి పెరిగాయని, గడిచిన 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 391 కేసులు, నాలుగు మరణాకు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం అధికారిక ప్రకటనలో ఈ గణాంకాలను విడుదల చేసింది. మరణాలు కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొటి చొప్పున సంభవించాయి. కేరళలో 127, గుజరాత్‌లో 102, ఢిల్లీలో 73, పశ్చిమ బెంగాల్‌లో 26 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 8 నాటికి మొత్తం 5,484 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు, ఈ నెలలో 760 మంది కోలుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలు మాత్రమే గత 24 గంటల్లో కొత్త కొవిడ్ కేసులు నమోదు చేయలేదు. మధ్యప్రదేశ్‌లో తొమ్మిది నెలల గర్భవతి అయిన 45 ఏళ్ల మహిళ మూర్ఛరోగంతో బాధపడుతూ మరణించింది. తరువాత ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రలో హైపర్ థైరాయిడిజం ఉన్న 63 ఏళ్ల వ్యక్తి కొవిడ్ వైరస్ బారిన పడ్డాడు. అలాగే, కేరళలో ఫోర్త్ స్టేజ్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న 59 ఏళ్ల వ్యక్తి కోవిడ్-19 సమస్యలతో మరణించాడు. తమిళనాడులో నెల రోజులుగా మంచం పట్టిన 79 ఏళ్ల డయాబెటిక్ వ్యక్తి కోవిడ్-ప్రేరిత న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో మరణించాడు. జనవరి నుంచి మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ సంబంధిత మరణాలు (18) నమోదయ్యాయి. తరువాత కేరళ (12), ఢిల్లీ, కర్ణాటక (7 చొప్పున), తమిళనాడు (5), ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్ (2 చొప్పున) ఉన్నాయి. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కొక్కరు మరణించారు.

Next Story