కుక్క కాటుకు రూ.15 లక్షల పరిహారం.. పదేళ్లైన విడిచిపెట్టన కోర్టు

by Yella Dhawani Reddy |

సాధారణంగా కుక్క కరిస్తే.. టీకాలు వేయించుకుని కొన్ని రోజులు బాధపడుతాం.

కుక్క కాటుకు రూ.15 లక్షల పరిహారం.. పదేళ్లైన విడిచిపెట్టన కోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా కుక్క కరిస్తే.. టీకాలు వేయించుకుని కొన్ని రోజులు బాధపడుతాం. తర్వాత ఆ ఘటనను మర్చిపోతాం. మళ్లీ ఇంకొసారి వాటి జోలికి వెళ్లాలంటే భయపడిపోతుంటాం. కానీ, సూర్యాపేట (Suryapet) జిల్లా చింతలపాలెం మండలానికి చెందిన వెలమకన్ని కిశోర్‌కు అది ఒక జీవితాంతం గుర్తుండిపోయే ఘటనగా మారింది. ఎందుకంటే.. 15 ఏళ్ల క్రితం ఆయన ఓ పెంపుడు కుక్క కరిచింది. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. తాజాగా రూ.15 లక్షల పరిహారం లభించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడేనికి చెందిన వెలమకన్ని కిశోర్‌ 15 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా (America) వెళ్లాడు. ఈ క్రమంలో 2010లో రోడ్‌ఐలాండ్‌లో అద్దె ఇంటికోసం కార్లా అనే ఆమె ఇంటికి వెళ్లగా.. వారి పెంపుడు కుక్క కిశోర్‌పై దాడి చేసి కరిచింది. వైద్య ఖర్చులకు 600 డాలర్లు ఇస్తానని కార్లా హామీ ఇచ్చింది. అనంతరం ఆ మొత్తం ఇవ్వకుండా అతడిని తీవ్రంగా దుర్భాషలాడింది. దీంతో కిశోర్‌ వాషింగ్టన్‌ డీసీలో కోర్టును ఆశ్రయించారు. వాదనల అనంతరం ఆయనకు అనుకూలంగా అదే ఏడాది కోర్టు తీర్పు వెలువరించింది. వైద్య ఖర్చులు, న్యాయ ఖర్చులు, పరిహారం, వడ్డీ కలిపి 10,359 డాలర్లు బాధితుడికి ఇవ్వాలని ఆదేశించింది. అయితే కార్లా ఐపీ పెట్టడం, ఇల్లు తనఖాలో ఉండటంతో పరిహారం రాలేదు.

ఇటీవల ఆమె తన ఇంటిని విక్రయించగా.. కోర్టు ఆదేశాల మేరకు కొనుగోలుదారు నుంచి ఆ పరిహారం మొత్తం వడ్డీతో కలిపి 29,092.91 డాలర్లను న్యాయస్థానం అతడిని ఇప్పించింది. లాయర్‌ ఫీజులు, ఇతర ఖర్చులు పోనూ తన ఖాతాలో 18,429.83 డాలర్లు (రూ.15.73 లక్షలు) గత నెల 25న జమయ్యాయని కిశోర్‌ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం తాను కెనడాలో నివాసం ఉంటున్నా.. అమెరికాలో తనకు న్యాయం జరిగిన తీరు.. అక్కడి న్యాయవ్యవస్థ పటిష్ఠతకు అద్దం పడుతుందన్నారు.

Next Story