మహారాష్ట్రలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. మహాయుతి, మహా వికాస్ కూటమిలో ఉత్కంఠ

by Malleboina Mahesh |

మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో మున్సిపల్ కౌన్సిల్, నగర్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది.

మహారాష్ట్రలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. మహాయుతి, మహా వికాస్ కూటమిలో ఉత్కంఠ
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో మున్సిపల్ కౌన్సిల్, నగర్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ (counting process) ఉత్కంఠగా సాగుతోంది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం కాగా, ప్రధాన రాజకీయ పార్టీలైన మహాయుతి, మహా వికాస్ అఘాడీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. వాశిం, కరంజా, మంగ్రుళ్‌పీర్ వంటి కీలక మున్సిపల్ కౌన్సిళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం కొన్ని స్థానాల్లో అధికార కూటమి మరికొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలు ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 20న జరిగిన తుది విడత పోలింగ్‌లో ఓటర్లు భారీగా పాల్గొనడంతో అభ్యర్థుల జయాపజయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర స్థానిక రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వాశిం జిల్లాలోని వాశిం, రిసోద్, మలేగావ్, కరంజా వంటి స్థానిక సంస్థలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో, గెలిచిన అభ్యర్థులు మరియు వారి మద్దతుదారులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఇతర జిల్లాల్లో కూడా ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల పాలనలో కొత్త నాయకత్వం కొలువుదీరనుంది.

Next Story