అమెరికా భారీ శాటిలైట్ 'బ్లూబర్డ్' ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం

by Malleboina Mahesh |

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో భారీ వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది.

అమెరికా భారీ శాటిలైట్ బ్లూబర్డ్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో భారీ వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం (డిసెంబర్ 24) ఉదయం 08:54 గంటలకు LVM3-M6 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఈ ప్రయోగం ద్వారా అమెరికాకు చెందిన 'AST SpaceMobile' సంస్థ రూపొందించిన 6,500 కేజీల బరువైన 'బ్లూబర్డ్ బ్లాక్-2' కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. భారత గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న అత్యంత బరువైన వాణిజ్య ఉపగ్రహంగా ఇది రికార్డు సృష్టించబోతోంది. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ ఇప్పటికే తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ 'బ్లూబర్డ్' ఉపగ్రహం టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఎటువంటి ప్రత్యేక యాంటెన్నాలు లేదా సిగ్నల్ టవర్లు అవసరం లేకుండా, మారుమూల ప్రాంతాల్లో కూడా నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకే 4G మరియు 5G హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం దీని ప్రత్యేకత. అంతరిక్షం నుండే నేరుగా మొబైల్ ఫోన్లకు కనెక్టివిటీని ఇచ్చే ఈ సరికొత్త టెక్నాలజీతో ఇకపై 'నో సిగ్నల్' అనే సమస్య ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు షార్‌లోని లాంచ్ వ్యూ గ్యాలరీ వద్ద సందర్శకుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

Next Story