- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3395కి చేరిన కరోనా కేసులు.. కేరళలో అత్యధికంగా 1336 కేసులు
దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3395కి చేరింది. ముఖ్యంగా కేరళలో అత్యధికంగా 1336 కేసులు నమోదయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో: భారత దేశంలో మరోసారి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 3395కి పెరిగింది. వీటిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఏకంగా 1336 కేసులు నమోదవడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (467), ఢిల్లీ (375), గుజరాత్ (265), కర్ణాటక (234), పశ్చిమ బెంగాల్ (205), తమిళనాడు (185) ఉన్నాయి. మిజోరాంలో ఏడు నెలల తర్వాత కొత్తగా రెండు కరోనా కేసులు నమోదవడం గమనార్హం. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు మృత్యువాత పడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. దీంతో ఈ ఏడాదిలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 26కు చేరింది. అయితే మృతుల్లో చాలామంది వేరే ఇతర ప్రమాదకరమైన వ్యాధులతో పోరాడుతున్న వారేనని సమాచారం. ఆ వ్యాధులకు కరోనా కూడా తోడవడంతోనే వారు ప్రాణాలు కోల్పోయినట్లు కనిపిస్తోంది. అలాగే గడిచిన 24 గంటల్లో 265 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.
అయితే ప్రస్తుతం వెలుగు చూస్తున్న కరోనా కేసులన్నీ చాలా స్వల్ప లక్షణాలనే కనబరుస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ చెప్తోంది. కేరళలో ఎక్కువగా టెస్టులు చేయడం వల్లనే ఎక్కువ కేసులు వెలుగు చూసి ఉండొచ్చని కూడా నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రులను ముందుగానే హెచ్చరించాయి. హాస్పిటల్స్‌లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ ఫెసిలిటీలు, వ్యాక్సీన్లు తదితర సదుపాయాలన్నీ ఉండేలా చూసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తుతానికి తీవ్రమైన కరోనా కేసులు లేనప్పటికీ.. ముందు జాగ్రత్త కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాగా, యూఎస్ వంటి దేశాల్లో కూడా ఎన్‌బీ.1.8.1 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అక్కడి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవలే వెల్లడించింది.
కొత్త వేరియంట్ల ప్రభావం..
కరోనా కేసులు గత రెండు వారాల్లో వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి రెండు కొత్త ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లు ఎల్ఎఫ్.7, ఎన్‌బీ.1.8.1 కారణమని నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో జేఎన్.1 వేరియంట్ కేసులో అత్యధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎన్‌బీ.1.8.1 వేరియంట్ కేసులు 10 శాతం కన్నా ఎక్కువ ఉన్నాయని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఎల్ఎఫ్.7, ఎన్‌బీ.1.8.1 వేరియంట్లను డబ్ల్యూహెచ్‌వో కేవలం ‘వేరియంట్స్ అండర్ మానిటరింగ్’ విభాగంలో మాత్రమే ఉంచింది.
కేసులు పెరగడానికి కారణాలు..
భారత్‌లో కరోనా వ్యాక్సీన్‌ను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. దీంతో దాదాపుగా ప్రజలంతా వ్యాక్సీన్ తీసుకున్నవారే. అయినా కరోనా కేసులు పెరగడానికి రెండు కారణాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. కరోనా వ్యాక్సీన్ మనల్ని కొంత కాలమే కాపాడుతుందని, ఆ తర్వాత నెమ్మదిగా వ్యాక్సీన్ ప్రభావం తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు. దీని వల్ల కరోనా మళ్లీ మనపై దాడి చేసే అవకాశం ఉంది. అలాగే వయసు మళ్లిన వారిలో సాధారణంగానే రోగనిరోధక శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో వ్యాక్సీన్ ప్రభావం కూడా త్వరగా తగ్గిపోతుంది. దీంతో కరోనా మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కొత్త వేరియంట్లు వ్యాక్సీన్‌ను కూడా కొంత వరకు తప్పించుకుంటున్నాయి. ఇక వ్యాక్సీన్ తీసుకోని వారిలో మరింత వేగంగా వ్యాపించడంలో ఆశ్చర్యం ఏముందనేది నిపుణుల వాదన. ఈ కారణాల వల్లనే కరోనా కేసులు వేగంగా పెరుగుతుండొచ్చని వారు చెప్తున్నారు.
బూస్టర్ డోస్ మంచిదేనా?
ఇప్పటికే ప్రైమరీ డోస్ వ్యాక్సీన్ తీసుకున్న ప్రజలు.. ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు చూసి బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదా? అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో 18 సంవత్సరాలు నిండిన వారంతా బూస్టర్ డోసులు తీసుకుంటేనే మంచిదని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు కచ్చితంగా బూస్టర్ డోసులు తీసుకోవాలంటున్నారు. వారిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లడం వల్ల కొత్త వేరియంట్లు సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బూస్టర డోస్ తీసుకుంటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించడం మంచిదని వైద్యులు చెప్తున్నారు. అలాగే మరీ బిజీగా ఉండే సమయాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులు ఎవాయిడ్ చేయడం, సాధ్యమైనన్నిసార్లు చేతులు శుభ్రం చేసుకోవడం, తరచూ తాకే మొబైల్స్, కీబోర్డులు వంటి వస్తువులను శానిటైజేషన్ చేసుకోవడం, పనిచేసే ప్రాంతాల్లో వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సలహా.






