కునాల్ కామ్రా ఇంటికి పోలీసులు

by Ajay Maddhiboyina |

శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ మార్చి 24న ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత రెండు సార్లు సమన్లు పంపారు.

కునాల్ కామ్రా ఇంటికి పోలీసులు
X

- సమన్లకు స్పందించని కామ్రా

- స్వయంగా వెళ్లిన పోలీసులు

- సమయం వృధా అంటూ కామ్రా వ్యాఖ్యలు

- పదేళ్లుగా అక్కడ ఉండటం లేదని వెల్లడి

దిశ, నేషనల్ బ్యూరో: స్టాండప్ కమేడియన్ కునాల్ కామ్రా కోసం పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. నయా భారత్ పేరుతో కునాల్ కామ్రా చేసిన స్టాండప్ కామెడీని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండేను ఉద్దేశించి 'గద్దార్' అని సంభోధించాడన్న కారణంతో శివసేన కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ఆ వీడియో రికార్డు చేసిన హాబిటాట్ క్లబ్, స్టూడియోను ధ్వంసం చేశారు. అయితే కునాల్ కామ్రాపై మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. మార్చి 31న ఖార్ పోలీసులు విచారణ కోసం సమన్లు పంపారు. కానీ కునాల్ కామ్రా మాత్రం హాజరు కాలేదు. దీంతో సోమవారం పోలీసులు స్వయంగా కామ్రా ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ అంశంపై కామ్రా స్పందించాడు. గత 10 ఏళ్లుగా తాను అక్కడ నివసిండం లేదని.. మీరు అక్కడకు వెళ్లడం సమయాన్ని, ప్రజా వనరులను వృధా చేయడమే అని చెప్పాడు.

శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ మార్చి 24న ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత రెండు సార్లు సమన్లు పంపారు. ఇదే కేసులో జల్గావ్ నగర మేయర్ ఒక ఫిర్యాదు చేశారు. నాసిక్‌కు చెందిన ఒక హోటల్ యజమాని, బిజినెస్ మ్యాన్‌ కూడా వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. అయితే తమిళనాడులో నివసిస్తున్న కామ్రా.. ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తనకు మహారాష్ట్రలోని శివసేన కార్యకర్తల నుంచి 500 బెదిరింపు కాల్స్ వచ్చాయని హైకోర్టుకు తెలియజేశారు. దీంతో ఏప్రిల్ 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ కేవలం ధనవంతులు, శక్తివంతులమైన వారికి మాత్రమే కాదని కామ్రా అన్నారు. తనపై చట్టబద్దంగా చర్యలు తీసుకుంటే పోలీసులకు, కోర్టులకు సహకరిస్తానని కామ్రా చెప్పారు.వాక్ స్వాతంత్రంలో భాగంగా వ్యంగ్యానికి రక్షణ ఉందని అన్నారు. జనవరిలో చిత్రీకరించన తన షోలో ఎవరి పేర్లను ప్రస్తావించలేదని కామ్రా తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

Next Story