- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air Chief: ప్రాజెక్టుల డెలివరీల్లో జాప్యంపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ అసంతృప్తి
ఎయిర్ ఫోర్స్ లోని ప్రాజెక్టుల డెలివరీల్లో జాప్యంపై వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఎయిర్ ఫోర్స్ లోని ప్రాజెక్టుల డెలివరీల్లో జాప్యంపై వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చాలా సార్లు కాంట్రాక్టులపై సంతకాలు జరగుతాయి.. కానీ, సిస్టమ్స్ మాత్రం ఎప్పటికీ అందవు. ఇక్కడ టైమ్‌లైన్ అసలైన సమస్య. సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా నాకు గుర్తుకురావట్లేదు. మనం చేయలేని పనికి హామీలు ఎందుకు? తేజస్ ఎంకే1 చాలా ఆలస్యమైంది. ఇక తేజస్ ఎంకే2 ప్రొటోటైప్ కూడా అందుబాటులోకి రాలేదు. ఇక ఆమ్కా ఫైటర్‌కు సంబంధించి ఇప్పటి వరకు నమూనా విమానం కూడా రాలేదు. సాయుధ దళాలు.. పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉంది. పారదర్శకత చాలా అవసరం. ఒక్కసారి దేనికైనా కట్టుబడితే.. దాన్ని అందించి తీరాల్సిందే. మేకిన్ ఇండియా కోసం ఎయిర్ ఫోర్స్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పుడు సంసిద్ధంగా ఉంటేనే.. భవిష్యత్తుకు సన్నద్ధం కాగలము. మనం భారతదేశంలో ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడలేము. డిజైన్ గురించి కూడా మాట్లాడాలి. రానున్న పదేళ్లలో.. మన పరిశ్రమలు ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవు. కానీ, ప్రస్తుతానికి మనం త్వరగా చర్యలు తీసుకోవడం అవసరం. దళాలను శక్తిమంతం చేసుకొంటేనే యుద్ధాలు గెలుస్తాం’’ అని పేర్కొన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్' చొరవ కింద వేగవంతమైన స్వదేశీకరణ, దేశీయ సామర్థ్యం కోసం ఐఏఎఫ్ ఒత్తిడి చేస్తున్న తరుణంలో ఎయిర్ ఫోర్స్ చీఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. మరోవైపు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలోనే డెలివరీల ఆలస్యంపై విమర్శించడం గమనార్హం.
న్యూ టెక్నాలజీ గురించి
అంతేకాకుండా, ఆపరేషన్ సిందూర్ ని ప్రస్తావిస్తూ.. కొత్త సాంకేతికతలు, వాటి ఉత్తమ కార్యాచరణ సంసిద్ధతలో ఉంచడానికి ఏమి చేయగలమో ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ వివరించారు. యుద్ధ రంగంలో వేగంగా మారిపోతున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. ‘‘మన నౌకాదళాధిపతి చెప్పినట్లు యుద్ధ రంగం వేగంగా మారిపోతోంది. ప్రతి రోజు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నట్లు చూస్తున్నాం. ఆపరేషన్ సిందూర్‌తో.. మనం ఎక్కడ ఉన్నాం.. భవిష్యత్తుకు ఏం కావాలనే దానిపై స్పష్టమైన అవగాహన వచ్చింది. మనం చేయాల్సింది చాలా ఉంది. అంతేకాకుండా, ఆమ్కా ప్రాజెక్టును ప్రైవేటు సెక్టార్ కోసం కూడా క్లియర్ చేశారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. మన ప్రైవేటు రంగంపై దేశానికి ఆ స్థాయిలో విశ్వాసం ఉంది. భవిష్యత్తులో భారీ మార్పులకు ఇది మార్గం సుగమం చేస్తుంది’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఇలాంటి విమర్శలు చేయడం ఏపీ సింగ్ కు ఇది కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో కూడా తేజస్ డెలివరీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.‘‘తయారీ సంస్థలు ఉత్పత్తి వేగం పెంచడానికి అత్యాధునిక వ్యవస్థలపై పెట్టుబడులు పెట్టాలి. వారి మానవ వనరుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దాలి. తేజస్ తొలి ఎయిర్ క్రాఫ్ట్ 2001లోనే గాల్లోకి ఎగిరింది. 2016 నుంచి ఇప్పటి వరకు తొలి 40 విమానాల డెలివరీ కూడా పూర్తికాలేదు’’ అని అప్పట్లో ఆయన కామెంట్స్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.






