ఇండోర్ లో డయేరియా కలకలం.. ఏడుగురు మృతి, 100 మందికి పైగా ఆస్పత్రిపాలు

by Naga Rani Yarlagadda |

ఇండోర్ లో అతిసారం వ్యాధి ప్రబలింది. నీటి ద్వారా ఈ వ్యాధికి గురైన 100మంది పైగా ప్రజలు ఆస్పత్రి పాలవ్వగా, 7గురు మరణించారు.

ఇండోర్ లో డయేరియా కలకలం.. ఏడుగురు మృతి, 100 మందికి పైగా ఆస్పత్రిపాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో డయేరియా కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా నగరంలోని భగీరథ్ పుర ప్రాంతంలో కలుషిత నీరు తాగడంతో అతిసార వ్యాధి ప్రబలింది. ఫలితంగా ఏడుగురు మరణించగా.. 100 మందికి పైగా ఆస్పత్రి పాలైనట్లు ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ వెల్లడించారు. మరణించిన వారిలో ముగ్గురిని నందలాల్ పాల్ (70), ఊర్మిళా యాదవ్ (60), తారా కోరి (65)లుగా గుర్తించామన్నారు. మరో నలుగురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వీరంతా విరేచనాల కారణంగా మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు. డయేరియా ప్రబలుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టని అధికారులపై చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు.

ప్రస్తుతం మోహన్ యాదవ్ పరిపాలన పౌర సంస్థ నుంచి ఒక జోనల్ అధికారిని, భగీరథ్ పురలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ను సస్పెండ్ చేశారు. కాగా.. ఇండోర్ లో డయేరియా మరణాలపై సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల వైద్యం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అరబిందో ఆస్పత్రిలో రోగుల కోసం 100 అదనపు బెడ్లను కేటాయించింది. స్థానికక ఆరోగ్య శాఖ 2703 ఇళ్లను సర్వే చేసి 12 వేల మందిని పరీక్షించి, తేలికపాటి లక్షణాలు ఉన్న 1146 మంది రోగులకు ప్రాథమిక చికిత్స అందించింది. తీవ్ర లక్షణాలున్న 111 మందిని ఆస్పత్రికి తరలించారు.

Next Story