Karnataka High Court: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక సంబంధాన్ని వేధింపులుగా వర్గీకరించలేమని కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) వెల్లడించింది.

Karnataka High Court: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక సంబంధాన్ని వేధింపులుగా వర్గీకరించలేమని కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) వెల్లడించింది. శివమొగ్గ జిల్లాలోని సాగర్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి. అశోక్ కుమార్ పై ఓ మహిళ చేసిన శారీరక, లైంగింక వేధింపుల ఆరోపణలపై కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణ సందర్భంగానే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘పరస్పర అంగీకారంతో కొనసాగిన లైంగిక సంబంధాన్ని వేధింపులుగా పరిగణించలేం. అయితే.. పరస్పర అంగీకారం అంటే మహిళపై దాడి చేయడానికి వ్యక్తికి లైసెన్స్‌ ఇచ్చినట్లు కాదు’’ అని తెలిపింది. దీంతో, ఇన్‌స్పెక్టర్‌పై మహిళ మోపిన లైంగిక వేధింపుల అభియోగాలను కొట్టివేసింది. కానీ, దాడి, బెదిరింపులు, హత్యాయత్నం అభియోగాలను కోర్టు సమర్థించింది. ఈ అంశంపై ఇన్‌స్పెక్టర్ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తెలిపింది.

కేసు ఏంటంటే?

అశోక్‌కుమార్‌ 2017 నుంచి పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. అప్పట్నుంచి ఓ మహిళతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే.. అతడు తనను శారీరక, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ 2021 మేలో ఆ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను ఇచ్చిన కంప్లైంట్‌ను వెనక్కి తీసుకోకపోతే.. తన పిల్లలకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. నవంబర్ 11, 2021న అశోక్ తనను ఒక హోటల్‌కు తీసుకెళ్లాడని.. అక్కడ తన ఇష్టానికి విరుద్ధంగా శారీరక, లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను తెల్లవారుజామున 2.45 గంటలకు సాగర్‌లోని బస్ స్టాప్‌లో దింపినట్లు పేర్కొంది. దీంతో, ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. కాగా, తనపై మహిళ చేసిన అభియోగాలకు వ్యతిరేకంగా ఇన్‌స్పెక్టర్‌ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Next Story