Shashi Tharoor: ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ గా మారారు.. శశిథరూర్ పై కాంగ్రెస్ విమర్శలు

by Shamantha N |

పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలిపేందుకు భారత ప్రతినిధిబృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని దౌత్యబృందం పనామాలో పర్యటిస్తున్నారు.

Shashi Tharoor: ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ గా మారారు.. శశిథరూర్ పై కాంగ్రెస్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలిపేందుకు భారత ప్రతినిధిబృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని దౌత్యబృందం పనామాలో పర్యటిస్తున్నారు. అక్కడ థరూర్ మాట్లాడుతూ.. గత నాలుగు దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాడులను ఎదుర్కొందని, ఈ బాధను, నష్టాన్ని భరిస్తూ అంతర్జాతీయ సమాజానికి చెప్పుకోవడం ఇకపై ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. "మాపై ఏం జరుగుతుందో చూడండి. మాకు సాయం చేయండి, నేరస్థులను గుర్తించి శిక్షించేలా ఒత్తిడి తీసుకురండని అడగడం ఇక సరికాదు" అని ఆయన అన్నారు. 2008 ముంబై ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించారు. "మా వద్ద అన్ని ఆధారాలున్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్‌ను ఒక ధైర్యవంతుడైన పోలీసు అధికారి ప్రాణత్యాగం చేసి మరీ పట్టుకున్నారు. అతడిని, పాకిస్థాన్‌లోని అతడి ఇంటిని, చిరునామాను, గ్రామాన్ని గుర్తించారు. భారత్‌తో పాటు పాశ్చాత్య నిఘా సంస్థల వద్ద కూడా ముంబైలో హంతకులకు పాకిస్థానీ హ్యాండ్లర్ నిమిష నిమిషానికి సూచనలిచ్చిన భయంకరమైన సంభాషణల రికార్డింగ్‌లు ఉన్నాయి. దాడులు జరుగుతున్నప్పుడే అన్ని ఆధారాలు సేకరించి, నివేదికలు సిద్ధం చేశారు. కానీ ఏం జరిగింది? ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఒక్కరినైనా ప్రశ్నించారా?, శిక్షించారా? అంటే లేదనే చెప్పాలి. పాకిస్థాన్ దురదృష్టవశాత్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని ఎంచుకుంది" అని థరూర్ వివరించారు.

మోడీ సర్కారుపై ప్రశంసలు..

అయితే, ఇటీవలి సంవత్సరాలలో పరిస్థితి మారిందని, ఉగ్రవాదులు కూడా తాము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించారని శశిథరూర్ పేర్కొన్నారు. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. "ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. 2015 సెప్టెంబర్‌లో జరిగిన ఉరి దాడి తర్వాత, భారత్ తొలిసారిగా నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద స్థావరంపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఇది మనం గతంలో చేయనిది. కార్గిల్ సమయంలోనూ ఆ పని చేయలేదు. ఆ తర్వాత 2019 జనవరిలో పుల్వామా దాడి జరిగింది. ఈసారి మనం నియంత్రణ రేఖనే కాకుండా, అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి బాలాకోట్‌లోని ఉగ్రవాద ప్రధాన కార్యాలయంపై దాడి చేశాం. కానీ ఆపరేషన్ సిందూర్ లో ఆ రెండింటినీ మించిపోయాం. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దును దాటడమే కాకుండా, పాక్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేశాం. ఈ ఆపరేషన్ అత్యవసరం.మహిళల సిందూరాన్ని తుడిచివేసిన వారిని వదిపెట్టవద్దని భారత్ నిర్ణయించుకుంది" అని థరూర్ తెలిపారు.

శశిథరూర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

కాగా.. పలుమార్లు పార్టీకి వ్యతిరేకంగా థరూర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అతనిపై గుర్రుగా ఉంది. ఇప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. థరూర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పార్టీ నేత ఉదిత్ రాజ్ తీవ్రంగా స్పందించారు. "కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బీజేపీకి సూపర్ స్పోక్స్‌పర్సన్. బీజేపీ నేతలు కూడా చెప్పని విధంగా ఆయన మోడీజీకి, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేసేవో ఆయనకు తెలుసా? భారత సాయుధ బలగాల ఘనతను వీరు (కేంద్ర ప్రభుత్వం) తమ ఖాతాలో వేసుకుంటున్నారు. శశిథరూర్ బీజేపీ ప్రచార విన్యాసాలకు ప్రతినిధిగా మారారు" అని ఉదిత్ రాజ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ విమర్శించారు. మరోవైపు, భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో థరూర్ వివిధ ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రకటనలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. విదేశాలకు న్యూఢిల్లీ సందేశాన్ని తీసుకెళుతున్న ఏడు భారత ప్రతినిధి బృందాలలో ఒకదానికి శశిథరూర్‌ను ఎంపిక చేయడం కూడా వివాదానికి దారితీసింది. ప్రభుత్వానికి తాము సూచించిన నలుగురు ఎంపీలలో ఆయన లేరని కాంగ్రెస్ నాయకత్వం పేర్కొంది.

Next Story