కాంగ్రెస్ కీలక నిర్ణయం.. తమిళనాడులో దళపతి విజయ్‌కి మద్దతు

by Gantepaka Srikanth |

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK)కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ కీలక నిర్ణయం.. తమిళనాడులో దళపతి విజయ్‌కి మద్దతు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK)కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118)కు 10 స్థానాల దూరంలో టీవీకే నిలిచిన తరుణంలో, కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ అగ్రనేతలు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ త్వరలోనే ఒక విలేకరుల సమావేశం నిర్వహించి, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు అనివార్యమైంది. ఈ క్రమంలో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మారుతున్న సమీకరణాలు..

దశాబ్దాలుగా డీఎంకే (DMK)తో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు విజయ్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త మలుపు రాబోతోంది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరమని భావిస్తున్న కాంగ్రెస్, విజయ్ వంటి యువ నేతతో జతకట్టడం ద్వారా రాష్ట్రంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విజయ్ ఇప్పటికే 'రిసార్ట్ పాలిటిక్స్' ప్రారంభించారు. తన 108 మంది ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు తరలించారు. కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, మరికొంతమంది స్వతంత్రుల మద్దతును కూడగట్టేందుకు టీవీకే వ్యూహకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ మద్దతు గనుక అధికారికంగా ఖరారైతే, దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం అవుతుంది.

Next Story